Gentleman| Mental Krishna| Posani| Arti Agarwal| Natasa| Surekha Vani | "జెంటిల్మెన్"గా అవతారమెత్తిన ''మెంటల్‌కృష్ణ''
|
అంటే ఈ క్యారెక్టర్‌లో పోసాని లంగాలు, జాకీట్‌లు వేసుకోడు. తన పాత్రద్వారా ఎదుటి పాత్ర అయిన (భార్యను) "జెంటిల్ ఉమెన్" అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులో పోసాని భార్యగా టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్తీ అగర్వాల్ నటిస్తోంది. భర్తను చెడుమార్గంలో వెళ్ళనీయకుండా చేసే "జెంటిల్ ఉమెన్" పాత్రలో ఆర్తీ నటిస్తుందని, ఇదే పోసాని కథలోని "కీ" పాయింట్ అని చిత్ర యూనిట్ అంటోంది. వెరైటీ కోసం ఈ సినిమాకు "జెంటిల్‌మెన్" అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ చిత్రం ప్రారంభం కూడా మెగాస్టార్, పీఆర్పీ అధినేత చిరంజీవి చేతుల మీదుగా శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. వీరభద్ర ప్రొడక్షన్స్ పతాకంపై నల్లం శ్రీనివాస్ సమర్పణలో నల్లం పద్మజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.. "రాజావారి చేపల చెరువు" తర్వాత చేస్తున్న చిత్రమిదన్నారు. ఇది కాకుండా పి. వాసు దర్శకత్వంలో నటిస్తున్నానని తెలిపారు. మరో మూడు చిత్రాలకు అడ్వాన్స్ కూడా తీసుకున్నానని పోసాని చెప్పుకొచ్చారు.
ఇక "జెంటిల్‌మెన్" విషయానికొస్తే.. "మగవాడికి చలించే గుణం.. ఆడదానికి ఆకర్షించే గుణం" ఉంటుంది. ఈ నేపథ్యంలో సాగే కథే ఈ చిత్రమని వెల్లడించారు. ఇందులో ఆర్తీ అగర్వాల్ తన భార్యగా నటిస్తోందని పోసాని అన్నారు.
ఇందులో జెంటిల్‌మెన్ కొంతకాలానికి భార్యకు వ్యక్తిగతంగా దూరంగా ఉంటూ.. అదేసమయంలో వృత్తిరీత్యా ఆమెకు దగ్గరవుతూ ఉంటాడు. వీరిద్దరి మధ్య ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందనే విషయాన్ని ఈ చిత్రంలో చర్చించినట్లు ఆయన తెలిపారు.
ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా సెర్బియాకు చెందిన నటసాను పరిచయం చేస్తున్నానని, మరో కథానాయికగా ధీటైన పాత్రలో సురేఖావాణి నటిస్తోందని పోసాని చెప్పారు. 35 రోజుల పాటు ఏకధాటిగా జరిగే షూటింగ్‌తో సినిమాను పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు.
హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ మాట్లాడుతూ.. నిజజీవితంలో తండ్రైన శశాంక్ అగర్వాల్, జెంటిల్‌మెన్‌లోనూ తనకు నాన్నగా నటిస్తున్నారని చెప్పింది. సినిమాలోనూ తనకు తండ్రిగా ఆయనే నటించడం ఎంతో ఆనందంగా ఉందని, తామిద్దరం కలిసి నటించాలన్న కోరిక ఈ చిత్రం ద్వారా నెరవేరిందని అగర్వాల్ తెలిపింది.
సెర్బియా మోడల్ నటసా మాట్లాడుతూ.. వృత్తిరీత్యా మోడల్ అయిన తాను జెంటిల్‌మెన్‌లో సెకండ్ హీరోయిన్ రోల్‌ను పోషిస్తున్నానని చెప్పింది. హైదరాబాద్‌కు రావడం ఇదే తొలిసారి ఆమె వెల్లడించింది.
చిరంజీవి అభిమానిగా ఆయన సినిమాలను పోటీపడి చూసేవాడినని, అలాంటిది ఆయన చేతుల మీదుగా జెంటిల్‌మెన్ సినిమా ప్రారంభం కావడం ఆనందంగా ఉందని చిత్ర సమర్పకుడు నల్లం శ్రీనివాస్ అన్నారు.
మానవీయ సంబంధాల మధ్య నడిచే కథతో ఈ సినిమా రూపొందుతోందని, బ్రహ్మానందం పాత్ర అద్భుతంగా ఉంటుందని సమర్పకులు చెప్పారు.
ఇంకా ఈ సినిమాకు కెమెరా: ఆనంద్ సి. కుమార్, ఎడిటింగ్: రవీంద్ర బాబు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పోసాని కృష్ణమురళి.