నాని, కలర్స్ స్వాతి హీరోహీరోయిన్లుగా నటించిన "అష్టాచమ్మా" సినిమాకు అరుదైన గౌరవం దక్కింది.
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రామ్‌మోహన్ నిర్మించిన "అష్టాచమ్మా" చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించింది.
ఇందులో భాగంగా.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) నిర్వహించే ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ కోర్సు విద్యార్థుల కేస్ స్టడీ కోసం అష్టాచమ్మా చిత్రాన్ని ఎంపిక చేశారు. ఒక తెలుగు చిత్రానికి బిజినెస్ స్కూలులో విద్యాత్మక గౌరవం దక్కడం ఇదే తొలిసారి అని చిత్ర నిర్మాత రామ్‌మోహన్ అన్నారు.
చిన్న బడ్జెట్ చిత్రమైనా అష్టాచమ్మా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం, మార్కెటింగ్ వూహ్యాలు వంటి పూర్తి వివరాలను ఐఎస్‌బి అసోసియేషన్ ప్రొఫెసర్ రామకృష్ణ వేలుమూరి ఆధ్వర్యంలో కోర్సు విద్యార్థులు తనను అడిగి తెలుసుకున్నారని నిర్మాత వెల్లడించారు.
మోహనకృష్ణ ఇంద్ర గంటి దర్శకత్వంలో తమ సంస్థపై రూపుదిద్దుకోనున్న తదుపరి చిత్రం వివరాలను త్వరలో తెలియజేస్తామని రామ్‌మోహన్ అన్నారు. సెప్టెంబర్‌లో కొత్త సినిమాను ప్రారంభించే అవకాశాలున్నాయని నిర్మాత వివరించారు.
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్ర మాట్లాడుతూ.. తాను రూపొందించిన అష్టాచమ్మా చిత్రానికి ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.
ఇదిలా ఉండగా.. అష్టాచమ్మా సినిమాతో హీరోయిన్‌గా రంగ ప్రవేశం చేసిన కలర్స్ స్వాతికి ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయి. తాజాగా స్వాతి నటించిన "కలవరమాయే మదిలో" సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.