1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Nachavle

Tanish| Nachavle| Super Good Films| Sunil| Deepti | "నచ్చావులే" తనీష్ హీరోగా "మంచివాడు"

తనీష్
WD
ఆణిముత్యాల్లాంటి అందరూ మెచ్చి అభినందించిన పలు ఉత్తమ కథా చిత్రాల్ని అందించిన సూపర్‌గుడ్ ఫిలిమ్స్ సంస్థ సునీల్ కథానాయకుడిగా "అందాల రాముడు" వంటి హిట్ చిత్రాన్ని అందించిన యువ దర్శకుడు లక్ష్మీనారాయణ (దీప్తి)కి మరో అవకాశాన్ని ఇచ్చింది.

నేటిమేటి యువకథానాయకుడు తనీష్ హీరోగా అందరూ మెచ్చే కథలో "మంచివాడు" అనే చిత్రాన్ని దీప్తి రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన సంగీత ముహూర్తం జూలై 31న సూపర్ గుడ్ థియేటర్‌లో జరిగింది.

"ఏదీ ఆ వెన్నెల... మెరిసే చెలికళ్ళలో.. కురిసే ఆ వెన్నెల.." అంటూ ఇ.ఎస్. మూర్తి వ్రాసిన గీతాన్ని ఉన్నిమీనన్ పాడగా రికార్డ్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు ఆర్.బి. చౌదరి మాట్లాడుతూ.. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన సూపర్‌హిట్ చిత్రం "నచ్చావులే" ద్వారా కథానాయకుడిగా అందరికీ పరిచయమైన తనీష్‌ని హీరోగా ఎన్నుకుని ఈ చిత్రాన్ని రూపొందించనున్నామన్నారు.

ఈ సినిమాలో భాగంగా.. పాటల రికార్డింగ్ జరిపామని, ఇందులో తనీష్ అందరూ మెచ్చే పాత్రను చేస్తున్నాడని చెప్పారు. కథా పరంగా హీరో ఉత్తమ గుణాలు కల్గిన మంచి కుర్రాడు. అందుకే ఈ చిత్రానికి "మంచివాడు" అనే పేరును పెట్టామని ఆర్.బి. చౌదరి తెలిపారు.

నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి. ప్రసాద్ "మంచివాడు" గురించి చెబుతూ.. సూపర్ గుడ్ సంస్థలు హిట్ చిత్రాన్ని చేసిన దీప్తికి మళ్లీ అవకాశాన్ని ఇస్తూ "మంచివాడు"ని నిర్మిస్తున్నామని వెల్లడించారు.

మరో నిర్మాత ఫారస్ జైన్ మాట్లాడుతూ.. ఇంటిల్లపాది మెచ్చే ఓ మంచి కథతో "మంచివాడు" చిత్రాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15న షూటింగ్ ముహూర్తాన్ని జరిపి ఇదే నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను మొదలు పెడతామని తెలిపారు. ఏకధాటిగా జరిగే షూటింగ్‌తో చిత్రాన్ని పూర్తి చేస్తామని ఫారస్ జైన్ అన్నారు.

తనీష్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో "ధామ" కథానాయికగా పరిచయమవుతోంది. సంగీత దర్శకుడు కోటి తనయుడైన రాజీవ్ మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. కె. విశ్వనాథ్, చంద్రమోహన్, వేణుమాధవ్, రఘుబాబు, కోవై సరళ, సుధ తదితరులు ఇందులో కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.

ఇ.ఎస్. మూర్తి, అభినవ శ్రీనివాస్ పాటల్ని రాస్తున్న ఈ చిత్రానికి శిల్పి సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వేణుగోపాల్, ఎడిటింగ్: నందమూరి హరి, కళ: కుమార్, నిర్మాతలు: ఎన్.వి. ప్రసాద్, ఫారస్‌జైన్, సమర్పణ: ఆర్.బి. చౌదరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి. లక్ష్మీ నారాయణ (దీప్తి).
About Writer
SELVI.M