1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Dil Raju

NTR| Dil Raju| PydiPalli Vamsi| Nagarjuna| V.V.Vinayak| Magadheera| RajaMouli | యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభం!

ఎన్టీఆర్
WD
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో "యంగ్‌టైగర్ ఎన్టీఆర్" కొత్త చిత్రం స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైంది.

"మున్నా" చిత్ర దర్శకుడు పైడిపల్లి వంశీ డైరక్షన్‌లో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోలో శనివారం ఆరంభమైంది.

ఎన్టీఆర్‌పై తీసిన ముహూర్తపు షాట్‌కు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున క్లాప్ కొట్టగా, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. "మగధీర" దర్శకుడు రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. తమ బ్యానర్‌పై వస్తోన్న 11వ సినిమా ఇదన్నారు. ఇప్పటికే తాను నిర్మించిన చిత్రాలు కుటుంబసమేతంగా చూసి ఆనందించేవిగా ఉన్నాయని, ప్రస్తుతం ఎన్టీఆర్‌తో తీసే కొత్త చిత్రం కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే రీతిలో ఉంటుందని చెప్పారు.

ఎన్టీఆర్ క్యారెక్టర్‌కు సంబంధించిన కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని దిల్‌రాజు అన్నారు. అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే రెగ్యులర్ షూటింగ్‌లో భాగంగా హైదరాబాద్, పొల్లాచ్చి తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుందని నిర్మాత తెలియజేశారు.

షూటింగ్‌తో పాటు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఎన్టీఆర్ కొత్త చిత్రాన్ని వేసవి సెలవుల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దిల్‌రాజు చెప్పారు.

దర్శకుడు పైడిపల్లి వంశీ మాట్లాడుతూ.. ఆర్య షూటింగ్ సమయంలో దిల్‌రాజుకు ఈ కథ చెప్పానని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరం కలిసి ఈ సినిమాను ప్రారంభించలేకపోయామని అన్నారు.

మొత్తానికి ఎన్టీఆర్, దిల్‌రాజు కాంబినేషన్‌లో తాను దర్శకత్వం వహించే కొత్త చిత్రానికి ఇప్పుడే తగిన సమయం కుదిరిందని వంశీ తెలిపారు. ఎన్టీఆర్ అభిమానుల అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా ఉంటుందని, వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.

ఇకపోతే.. రియల్ స్టార్ శ్రీహరి కీలక పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. హీరోయిన్, మిగిలిన తారాగణం వివరాలను త్వరలో తెలియజేస్తామని వంశీ చెప్పారు.
About Writer
SELVI.M