1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Aishwarya Rai

Ravana | Aishwarya Rai | Swine flu | Maniratnam | Heart attack, | ఐశ్వర్యకు స్వైన్ ఫ్లూ: అంతా రావణ బ్రహ్మ ఎఫెక్ట్

రావణ
IFM
రావణాసురుని పాత్రను కానీ, ఆ పేరుతో సినిమాను కానీ రూపొందిస్తే.. అది ఒక పట్టాన పూర్తి కాదని పాతతరం సినిమా కాలం నుంచే ఒక సెంటిమెంట్ ఉంది. అంతేకాదు ఆ చిత్రంలో పాల్గొనే టీమ్ సభ్యులను అనుకోని సమస్యలు చుట్టుముడతాయట. మణిరత్నం కొత్త "రావణ"లో తలెత్తుతున్న కష్టాలను చూస్తే అది నిజమేనేమో అనిపిస్తోంది.

ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన చిత్రం "భూకైలాస్"లో ఎన్టీఆర్ రావణాసురుని పాత్రను పోషించారు. ఆ సమయంలో ఆయన సంతానం తీవ్రమైన అనారోగ్యం పాలైందట. అప్పట్లో ఆయన ఓ జ్యోతిష్కుని కలిసి.. విషయమేమిటని ఆరాతీశారట. తను రావణాసురుని పాత్రను పోషించడం వల్లనే ఈ దుష్పరిమాణాలు తలెత్తుతున్నాయని సదరు జ్యోతిష్కుడు చెప్పారట. అంతే.. అప్పటి నుంచి రావణుని పాత్ర వేయాలంటే ఎన్టీఆర్‌తో పాటు అప్పటి తరం నటులందరూ వెనుకంజ వేసేవారట.

ఇక తాజాగా మణిరత్నం కొత్త "రావణ" విషయానికి వస్తే... ఈ సినిమా ఆరంభం నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది. తొలుత ఈ చిత్రానికి సంబంధించిన భారీ బడ్జెట్‌ను తాము తట్టుకోలేమని, బడ్జెట్లో కోత పెట్టుకోవాలని చిత్ర నిర్మాతలలో ఒకటైన రిలయన్స్ సంస్థ సూచించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలను పూర్తిగా మణిరత్నమే నెత్తికెత్తుకున్నారు. ఇలా బడ్జెట్ సమస్య నుంచి బయటపడి చిత్రం షూటింగ్‌ను జోరుగా చేస్తుండగా మణిరత్నానికి స్వల్పంగా గుండె పోటు వచ్చింది. ఆ సమస్య నుంచి మణిరత్నం బయటపడ్డారు. తిరిగి షూటింగ్ ప్రారంభించారు.

ఈ క్రమంలో కేరళలో చిత్రంకోసం ఒక కీలక సన్నివేశ చిత్రీకరణను చేస్తుండగా ఏనుగు సృష్టించిన బీభత్సం నుంచి ఐశ్వర్య, అభిషేక్‌లు తృటిలో తప్పించుకున్నారు. గజరాజు ఆగ్రహానికి తీవ్రంగా గాయపడిన మావటి అక్కడికక్కడే మరణించాడు. అదృష్టవశాత్తు హీరోయిన్ ఐశ్వర్యరాయ్, హీరో అభిషేక్‌ బచ్చన్‌లు ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ఇక తాజాగా షూటింగ్‌లో పాల్గొంటున్న ఐశ్వర్యరాయ్ స్వైన్ ఫ్లూ బారిన పడింది. దీంతో దర్శకుడు మణిరత్నం రావణ షూటింగ్‌ను వాయిదా వేశాడు. ఇలా రావణ చిత్రం ప్రారంభమైన దగ్గర్నుంచి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఇదంతా "రావణ బ్రహ్మ ఎఫెక్ట్" అంటున్నారు పాతతరం సినీ మిత్రులు. మరి మీరేమంటారు...?
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT