విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు
FILE
2007 సంవత్సరానికి గానూ ఫిల్మ్‌ఫేర్ జాతీయ అవార్డులను సోమవారం ప్రకటించారు. ఇందులో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రేసులో నిలిచిన బాలీవుడ్ అగ్రహీరోలైన షారూఖ్ ఖాన్, అమీర్‌ఖాన్‌లను ప్రకాష్ రాజ్ వెనక్కి నెట్టారు.
తమిళంలో ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన "కంజీవరం" నటనకు గాను ప్రకాష్ రాజ్‌ను ఉత్తమ నటుడి అవార్డు వరించింది. 1998లో ఆయన ఉత్తమ సహాయనటుడు అవార్డును, 2003లో జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా ప్రకాష్ రాజ్ అందుకోవడం గమనార్హం.
స్వాతంత్ర్యానికి పూర్వం కంజీవరంలోని చేనేత కార్మికుల జీవన స్థితిగతులను సజీవంగా తెరకెక్కించిన ప్రియదర్శన్ చిత్రం ప్రకాష్ రాజ్‌కు అవార్డును సంపాదించి పెట్టడమే గాకుండా.. 2007 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగానూ ఎంపికవడం విశేషం.
ఇకపోతే.. జాతీయ ఉత్తమ నటి అవార్డును గిరీష్ కర్నాడ్ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం "గులాబీ టాకీస్"లో నటించిన ఉమశ్రీ సొంతం చేసుకుంది.
ఇదేవిధంగా.. మరాఠీ చిత్రం "తంగ్యా"లో నటనకుగాను ఉత్తమ బాలనటుడి అవార్డును శరద్ గోయెకర్ కైవసం చేసుకున్నాడు. అలాగే ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ చిత్రం "గాంధీ మై ఫాదర్"లో నటించిన దర్శన్ జరీవాలాకు ఉత్తమ సహాయనటుడు అవార్డు లభించింది. ఇదే చిత్రానికి స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది.
ఇదిలా ఉంటే.. ఉత్తమ వినోదాత్మక చిత్రాల కేటగిరీలో "చక్ దే ఇండియా" ఉత్తమ కుటుంబగాథా చిత్రంగా "తారే జమీన్ పర్" ఎంపికైంది. ఈ చిత్రంలోని "మేరియా" పాటను పాడిన నేపథ్య గాయకుడు శంకర్ మహాదేవన్‌కు ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డు లభించింది.
