1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cinema

Young India| Cinema| Dasari Narayana Rao| Yagnam| Songs| Recording | "యంగ్ ఇండియా"ను యజ్ఞంలా చేస్తున్నాం: దాసరి

యంగ్ ఇండియా
WD
దర్శకరత్న డా. దాసరి నారాయణరావు ఎప్పుడు ఏం చేసినా అదొక సంచలనానికి శ్రీకారం చుడుతుందనే విషయం అందరికీ తెలిసిందే.

దర్శకుడిగా ఇంతవరకు 148 విజయోత్సవ చిత్రాల్ని తీర్చిదిద్ది ఎందరో నటీనటుల్ని, మరెందరో సాంకేతిక నిపుణుల్ని వెండితెరకు పరిచయం చేసిన ఆయన తన 149వ చిత్రాన్ని అంతా కొత్తవారితో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

దీనికోసం కొన్నివేలమంది దరఖాస్తులను పంపించడం, ఆ వేలాదిమందిలో నటనకు కావాల్సిన అన్ని అర్హతలు వున్నవారిని ఎంపిక చేయడం జరిగింది. తాజాగా ఎంపికైన కొత్తవారికి ఆయన 30 రోజుల పాటు ట్రైనింగ్ క్లాసులను నిర్వహిస్తున్నారు.

శ్రీమతి దాసరి పద్మ సమర్పణలో సిరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రామకృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సంచలనాత్మక చిత్రానికి సంబంధించిన సంగీత కార్యక్రమాలు ఎం.ఎం. కీరవాణి సారథ్యంలో ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే.

"యంగ్ ఇండియా"ను యజ్ఞంలా చేస్తున్నాం: దాసరి
ఈ విషయమై దర్శకరత్న డా. దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ఏడు సంవత్సరాల తర్వాత మళ్లీ తాను దర్శకత్వం వహిస్తోన్న "యంగ్ ఇండియా" అన్ని తరగతుల వారిని దృష్టిలో వుంచుకుని చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు.

కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ మన తెలుగు చిత్ర పరిశ్రమకి కొత్తవారిని పరిచయం చెయ్యాలనే ఆకాంక్షతో ఎంతో శ్రమపడి మంచి కథను తయారు చేయడం జరిగింది.

ఈ చిత్రంలో హీరో, హీరోయిన్‌లనే కాకుండా, సపోర్టింగ్ ఆర్టిస్టులను స్క్రీన్‌ప్లేలో వచ్చే మొత్తం ఆర్టిస్టులను కొత్తవాళ్లనే పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఓ యజ్ఞానికి శ్రీకారం చుడితే, కొన్ని వేలమంది కొత్తవారి తమకు అవకాశం ఇవ్వమని అప్లికేషన్స్ పంపారు. వాటిని ఎన్నిక చేసి అందులోంచి కొందరిని సెలక్ట్ చేసి "యంగ్ ఇండియా" కోసం వారికి శిక్షణ ఇస్తున్నామని దాసరి చెప్పారు.

ఇలా ఓ వైపు ఆర్టిస్టుల ఎన్నికలో తనతోపాటు తన యూనిట్ అందరూ కలిసి సమీక్షిస్తుంటే, చిత్రంలోని పాటల్ని ఎం.ఎం. కీరవాణి చేస్తున్నారు. దీనికి సంబంధించి కీరవాణి ఎన్నో స్వరాల్ని ఎంపిక చేసి తనకు వినిపించారని దర్శకరత్న ఈ సందర్భంగా తెలిపారు. తామిద్దరు కలిసి పాటలను ఫైనలైజ్ చేస్తున్నామని ఆయన అన్నారు.

ఇకపోతే.. సెప్టెంబర్ 23న గానగంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తాము ఎంపిక చేసిన నాలుగు పాటల్ని గానం చేసి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారని దాసరి వెల్లడించారు. ఇంకా ఈ పాటలను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉన్నాయని, తప్పకుండా శ్రోతలను ఆకట్టుకుంటాయని ఎస్‌పీబీ అన్నట్లు దర్శకరత్న పేర్కొన్నారు. యంగ్ ఇండియాకు సంబంధించిన మొత్తం పాటల్ని సెప్టెంబర్ నెలాఖరు నాటికల్లా రికార్డ్ చేస్తామని దాసరి అన్నారు.

ఏడు సంవత్సరాల తర్వాత దర్శకరత్న డా. దాసరి నారాయణరావు క్రియేట్ చేస్తున్న "యంగ్ ఇండియా" కొత్త చరిత్ర సృష్టిస్తుందని, ప్రయోజనాత్మక చిత్రం అవుతుందని ఆశిద్దాం.

ఈ చిత్రానికి సమర్పణ: శ్రీమతి దాసరి పద్మ, నిర్మాత: కె. రామకృష్ణప్రసాద్, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: డా. దాసరి నారాయణరావు.
About Writer
SELVI.M