1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. రాజకీయ ఘటికుల సమక్షంలో "ఘటికుడు" ఆడియో

Ghatikudu, Surya, Nayantara, Audio, Karunanidhi, Stalin | రాజకీయ ఘటికుల సమక్షంలో "ఘటికుడు" ఆడియో

ఘటికుడు
WD
సూర్య, నయనతార జంటగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధి వారసుడు స్టాలిన్ నిర్మిస్తున్న తమిళ చిత్రం "ఆదవన్" చిత్రం తెలుగులో "ఘటికుడు"గా వస్తోంది. ఈ చిత్రం తెలుగు హక్కులను ఇప్పటికే నిర్మాత, వ్యాపారవేత్త, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్ పొందారు.

సిఎన్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు హారిస్ జైరాజ్ సంగీతం అందించారు. ఈ ఆడియోను విజయదశమినాడు రాజమండ్రిలో జరిపారు. ఆడియో సీడీని అమలాపురం ఎంపీ హర్షకుమార్ ఆవిష్కరించి రాజమండ్రి శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావుకి అందజేశారు.

ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్‌లకు తూర్పు గోదావరి జిల్లా అనువుగా ఉంటుంది. అలాగే ఇక్కడనుంచి ఎంతోమంది వ్యక్తులు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఉన్నతస్థానంలో నిలిచారు. ఈ జిల్లాకి చెందిన చందన రమేష్ కూడా సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించారు.

రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ.. వస్త్ర వ్యాపార రంగంలో "ఘటికుడు" అనిపించుకున్న చందనరమేష్.. అతి తక్కువ సమయంలో రాజకీయ రంగంలో రాణించారు. అదేవిధంగా సినిమా రంగంలో కూడా ఘటికుడనిపించుకోవాలని చెప్పారు.

చందన రమేష్ మాట్లాడుతూ.. దాదాపు 42 కోట్ల రూపాయల వ్యయంతో అత్యంత భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు అనువాద హక్కులను తమకిచ్చినందుకు స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ అద్భుతమైన సంగీతాన్నందించారు. మా సొంత ఊరులో ఆడియోను విడుదల చేయాలనే ఆకాంక్షతో ఇక్కడ విడుదల చేశామన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చేనెలలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాజమండ్రి నగర మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, రాజకీయ ప్రముఖులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గన్నికృష్ణ, జక్కంపూడి విజయలక్ష్మి, కందుల దుర్గేష్, బొమ్మన రాజకుమార్, తుమ్మిడి రామ్‌కుమార్, చిత్రసమర్పకులు చందన నాగేశ్వర్, "సంతోషం" పత్రిక అధినేత సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.
About Writer
SELVI.M