టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, స్టార్ రైటర్, డైరక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ బాబు నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ చిత్రం గురించి నిర్మాత శింగనమల రమేష్‌బాబు మాట్లాడుతూ.. అక్టోబర్ 19 నుంచి ఏకధాటిగా జరుగుతోన్న ఈ షూటింగ్ షెడ్యూల్ సినిమా పూర్తయ్యేవరకు జరుగుతుందన్నారు. ఈ నెలాఖరువరకు హైదరాబాద్‌లో షెడ్యూల్ జరిపి నవంబరు తొలివారం నుంచి రాజస్థాన్‌లో నెలరోజుల పాటు చిత్రీకరణ జరుపుతామని నిర్మాత వెల్లడించారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత బి. బుల్లి సుబ్బారావు మాట్లాడుతూ.. నవంబరులో రాజస్థాన్ షెడ్యూల్‌ను పూర్తిచేసి డిసెంబరు తొలివారం నుంచి వికారాబాద్‌లో వేస్తోన్న భారీ విలేజ్ సెట్‌లో షెడ్యూల్ చేస్తామన్నారు. భారీ ఎత్తున నిర్మాణం అవుతున్న ఈ చిత్రంలో ఎన్నో హైలైట్స్ ఉన్నాయని సుబ్బారావు చెప్పారు.
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు, అనుష్క జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సునీల్, వేణుమాధవ్, అలీ, నాజర్, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ళ భరణి, షఫీ, సుశీల్ శర్మ, సుధ, శ్రీ రంజని తదితరులు నటిస్తున్నారు.
ఇంకా ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫోటోగ్రఫీ: సునీల్ పటేల్, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఆర్ట్: ఆనంద్‌సాయి, స్టిల్స్: దాస్, కో-డైరక్టర్స్: జాస్తి హేమాంబర్, రవికిరణ్.