అది నిరూపించేందుకే.. 7న వరద బాధితుల కోసం "స్టార్ నైట్"
WD
మెగాస్టార్ చిరంజీవి, మోహన్‌బాబుల మధ్య రాజుకున్న వివాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎప్పటినుంచో చిరు-మోహన్‌ల మధ్యగల ఈ విభేదాలు తెలుగు చిత్ర పరిశ్రమ డైమండ్ జూబ్లీ వేడుకల్లో బట్టబయలైంది. ఒకే వేదికపై చిరు-మోహన్‌లు ఒకరిపై ఒకరు మాటలు తూటాలు పేల్చుకుని వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల మధ్య ఎలాంటి విబేధాలు లేవని మా అధ్యక్షులు మురళీమోహన్ అన్నారు. తమలో ఎలాంటి విభేదాలు లేవని నిరూపించేందుకే నవంబర్ ఏడో తేదీన వరద బాధితుల సహాయార్థం "స్టార్ నైట్" కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫ్లడ్ రిలీఫ్ కమిటీ కన్వీనర్ దర్శకరత్న దాసరి నారాయణ రావు మాట్లాడుతూ.. నవంబర్ ఏడో తేదీ సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో వరద బాధితుల సహాయార్థం "స్టార్ నైట్" కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.
ఇందులో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు సౌత్ ఇండియన్ ఫిలింఛాంబర్, నడిగర్ సంఘం సభ్యులు, నటీనటులు, హిందీ సినిరంగానికి చెందిన ప్రముఖులు హాజరవుతారని దాసరి వెల్లడించారు.
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్, విజయ్‌కాంత్, శరత్‌కుమార్, అర్జున్, సూర్య తదితర హీరోలు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్నారు. పద్మభూషణ్ కమల్ హాసన్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కారణంగా వీలు చూసుకుని హాజరవుతారని దాసరి చెప్పారు.
WD
అలాగే జితేంద్ర, రాజేష్ కన్నాలు హాజరవుతున్న ఈ ప్రోగ్రామ్‌కు బాలీవుడ్ సూపర్‌స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాల్గొనే విషయం ఇంకో రెండు రోజుల్లో ఖరారవుతుందని దర్శకరత్న తెలియజేశారు.
వరద బాధితుల సహాయార్థం నిర్వహించే ఈ స్టార్‌నైట్ కార్యక్రమంలో ఎవరికీ ఫ్రీ పాసులుండవు. అందరూ స్టార్‌నైట్ పాసులు కొనుక్కుని రావాల్సిందేనని దాసరి అన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేసేందుకు సినీ పరిశ్రమతో పాటు ప్రభుత్వం కూడా తమ వంతు సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇంకా వరద బాధితుల కోసం 5, 6, 7 తేదీలను సినీ పరిశ్రమకు సెలవు రోజులుగా ప్రకటించడం జరగిందని దాసరి అన్నారు. ఈ మూడు రోజుల్లో ఎలాంటి షూటింగ్‌లు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
ఫ్లడ్ రిలీఫ్ కమిటీ ఛైర్మన్, నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ.. వరద బాధితులకోసం నిర్వహించే "స్టార్ నైట్"కు ప్రభుత్వం సహకరించాలని కోరారు. నాన్న ఎన్టీఆర్ హయాంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల్లో బాధితులైన ప్రజలకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించామని బాలయ్య ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
FILE
అలాగే.. సినీ ప్రముఖులందరూ సంయుక్తంగా స్టార్ నైట్‌ను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని బాలకృష్ణ అన్నారు. ఇకపోతే.. ఈ కార్యక్రమం కోసం ఎంబీఎస్ గ్రూప్ రూ.1.50లక్షలు అందజేసిందని ఆయన చెప్పారు. అలాగే టీవీ9 కూడా తమ వంతు సహాయాన్ని అందజేసిందని బాలకృష్ణ చెప్పారు.
స్టార్‌నైట్ కోసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగబాబు, జగపతిబాబు, పరుచూరి మురళీకృష్ణ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.