1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Raviteja

Nandi Awards 2008| Raviteja| Gamyam| Swati| Allari Naresh| Vinayakudu | 2008 నంది అవార్డులు: ఉత్తమ నటుడిగా రవితేజ

2008 నంది అవార్డులు
WD
2008 సంవత్సరానికిగాను నంది అవార్డులను తమ్మారెడ్డి భరద్వాజ శనివారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. నంది అవార్డుల్లో 'ఉత్తమ నటుడి‌'గా క్రేజీస్టార్ "రవితేజ" నిలిచాడు.

పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన "నేనింతే" చిత్రానికిగాను రవితేజకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు కింద రవితేజకు వెండి నందితో పాటు 30వేల రూపాయల నగదును అందజేస్తారు.

అలాగే ఉత్తమ నటి అవార్డును "అష్టాచమ్మా" సినిమా, హీరోయిన్ కలర్స్‌స్వాతి సొంతం చేసుకుంది. ఈ అవార్డు కింద కలర్స్ స్వాతికి వెండి నందితో పాటు 30వేల రూపాయల నగదును అందజేస్తారు. అదేవిధంగా ఉత్తమ దర్శకుడు అవార్డును "గమ్యం" సినిమాను రూపొందించిన రాధాకృష్ణకు దక్కింది.

ఇక.. ఉత్తమ సహాయ నటుడు అవార్డును అల్లరి నరేష్ (చిత్రం-గమ్యం), ఉత్తమ సహాయనటీమణి అవార్డును రక్ష (నచ్చావులే)లు సొంతం చేసుకున్నారు. ఈ పురస్కారాల కింద నరేష్, రక్షలకు కాంస్య నందితో పాటు రూ.20వేల నగదును అందజేయనున్నారు.

ఉత్తమ చిత్రం విభాగంలో క్రిష్ "గమ్యం" సినిమా పసిడి నందిని కైవసం చేసుకుంది. ఈ అవార్డు కింద రూ.75,000వేల నగదును "గమ్యం" చిత్రం బహుమతిగా గెల్చుకుంది. ఉత్తమ ద్వితీయ చిత్రంగా సరితాపాట్రా నిర్మించిన "వినాయకుడు", తృతీయ ఉత్తమ చిత్రంగా వెంకటరమణారెడ్డి నిర్మించిన "పరుగు" సినిమాలు నిలిచాయి.

ఇందులో ద్వితీయ ఉత్తమ చిత్రం అవార్డు కింద వెండి నంది, రూ. 40వేల నగదు, తృతీయ ఉత్తమ చిత్రం అవార్డు కింద కాంస్య నంది, రూ. 20వేల నగదును అందజేస్తారు.

ఇకపోతే.. 65 విభాగాల్లో ఎంపిక చేసిన నంది అవార్డుల్లో ఏ ఒక్క పిల్లల సినిమాగానీ, కుటుంబకథా చిత్రంగానీ ఎంపికకాకపోవడం గమనార్హం. డిసెంబర్ మొదటివారంలో నంది అవార్డులను ప్రదానం చేయనున్నారు.
About Writer
SELVI.M