అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆర్య-2 చిత్రం ఆడియో విడుదల ఆదివారం రాత్రి శిల్పకళా వేదికలో జరిగింది. ఇందులో నవదీప్, శ్రద్దాదాస్ మరో జంట నటిస్తున్నారు. భోగవల్లి ప్రసాద్, ఆదిత్యబాబు ఈ చిత్రానికి నిర్మాతలు.
ఈ కార్యక్రమంలో విశేషమేమిటంటే... ఆర్య-2 చిత్రంలోని పాటలకు డాన్సర్లు డాన్స్ చేయడం. ఒక్కో పాటను ఒక్కొక్కరు విడుదల చేశారు. దిల్ రాజు, మాగంటి బాబు, శ్రీను వైట్ల, వరుణ్ సందేశ్, ఆర్యన్ రాజేష్, మెహర్ రమేష్ తలోపాటను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ... దేవీశ్రీప్రసాద్ ఈ కార్యక్రమానికి పెండ్లికొడుకు. ఆయన పాటలు వింటుంటే హిట్ అవుతాయని తెలిసిపోతుంది. అర్జున్ నటించిన ఆర్య కంటే ఆర్య-2 పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు.
వినాయక్ మాట్లాడుతూ... ఇందులో మొదటి పాట మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అనే పదంతో వస్తుంది. దానికి సరైన వ్యక్తి సుకుమార్. దేవీశ్రీప్రసాద్ అర్జున్‌ను డామినేట్ చేస్తాడు అని చెప్పారు. ప్రభాస్ మాట్లాడుతూ... ఆర్య సినిమా హిట్ అవుతుందని బన్నీతో ముందే చెప్పాను. నేను అన్నట్లుగానే ఆ చిత్రం బిగ్ హిట్ అయింది. అలాగే ఈ చిత్రం కూడా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను అని అన్నారు.
నిర్మాత ఆదిత్య బాబు మాట్లాడుతూ... ఈ చిత్ర కథ భిన్నమైనది. శంకర్ దాదా జిందాబాద్ తరహాలో వైవిధ్యంగా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఆర్య అనేది ఎప్పటికీ సుకుమార్‌దే. ఇద్దరు హీరోలు నటిస్తే ఇగో ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. కానీ సరదాగా గడిచింది. నవదీప్‌కు కృతజ్ఞతలు అని చెప్పారు.