1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Geeta Reddy

International Children Festival 2009| Geeta Reddy| Hyderabad| Rosaiah| Dasari | అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ప్రారంభం

అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం
WD
16వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు శనివారంనాడు హైదరాబాద్‌లోని లలితకళాతోరణంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అంబికాసోని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించడంలో చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా చేస్తున్న కృషిని అభినందించారు.

బాలల చిత్రాలతో బాలలు చైతన్యవంతులవుతున్నారని ఆమె అన్నారు. అంతర్జాతీయస్థాయిలో జరిగే ఈ వేడుక రాష్ట్రంలో జరగడం విశేషతను సంతరించుకుందని, ప్రపంచంలోని సంస్కృతి, సంప్రదాయాలను, నృత్యాలను ఒకే వేదికపై తీసుకున్న విధానం ముగ్ధుల్ని చేసిందని కితాబిచ్చారు.

ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ నందితాదాస్‌ను అభినందించారు. ఈ ఉత్సవాల్లో నెలకొన్న అపోహపై స్పందిస్తూ.. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఎటువంటి విభేదాలు లేవని, ఇవన్నీ ప్రాంతీయ స్థాయి చిత్రాలు కావని అంబికాసోని స్పష్టం చేశారు.

దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. బాలల చిత్రోత్సవాల్లో తెలుగుకు అన్యాయం జరుగుతుందని, హడావుడిగా పదిరోజుల ముందు కమిటీ కూర్చుని సినిమాలపై చర్చించుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలుగులో 61ఏళ్ల క్రితమే దీక్ష, మూరేళ్ళమూకుడు వంటి చిత్రాలు నిర్మితమయ్యాయని గుర్తుచేశారు.

చాలాసార్లు మనల్నిమనం మర్చిపోతున్నామన్నారు. హైదరాబాద్‌లో చలనచిత్రోత్సవాలకు సరైన వేదిక కోసం మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారని, ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య ఉత్సవాలకు భవనాన్ని పూర్తిచేయాలని కోరారు.

అదేవిధంగా తెలుగులో బాలల చిత్రాలు నిర్మించే నిర్మాతలు పలు ఇబ్బందులకు గురవుతున్నారంటూ, నిర్మాత అప్లికేషన్‌కోసమే ఐదువేలు వెచ్చించడమే గాకుండా.. పరిశీలనకు 15 కాపీలు ఒకేసారి ఇవ్వాల్సి రావడంతో ఇబ్బందికి గురవుతున్నారని దాసరి అన్నారు. ఈ విషయాన్ని కమిటీ పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడుతూ.. నిస్వార్థ సేవలో త్యాగం ద్వారా ప్రజల్లో చెరగని ముద్రవేసిన జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలు జరగడం సముచితమన్నారు. ప్రస్తుతం పిల్లలు చిత్రాలు అంతగా రావడం లేదు. దానికి చాలా కారణాలున్నాయి. నిర్మాణవ్యయం రాబట్టకుండా నిర్మాతలు సందేశాత్మక చిత్రాలు తీయాలంటే 1, 2, చేయగలరు కానీ ఎక్కువ సంఖ్యలో చేయడం కష్టం. అందుకే ప్రభుత్వపరంగా ప్రోత్సాహాలు ఇచ్చాం. వాటిని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది.

రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా చేస్తే అప్పుడైనా బాలల చిత్రాలు మరిన్ని వస్తాయని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇటీవల సినిమాలు చూస్తుంటే నా బోటివాడు జీర్ణించుకోలేకపోతున్నాడు. కథ అర్థంకాదు, సందేశం తెలీదు. మొదటి నుంచి చివరికి యాక్షన్ సంఘటనలే చోటుచేసుకుంటున్నాయి. ఏది ఏమైనా హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఉత్సవాలు జయప్రదం కావాలని కోరారు.

సినిమాటోగ్రఫీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వంలోని పలు శాఖలు ఉత్సవాలకు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్భంగా రోశయ్యకు శ్రీ వేంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్, ఇలియానా, గుల్జార్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో వివిధ దేశాలకు చెందిన నృత్యాలు ఆహుతులను అలరించాయి.