ప్రధాన పేజివినోదం » వెండితెర » కథనాలు » "కె. రాఘవేంద్రరావు" దర్శకత్వంలో 'మంచు మనోజ్' కొత్త చిత్రం! (Manchu Manoj| K. Raghavendra Rao| Mohan Babu| BalaKrishna| NTR| Major ChandraKanth)
"కె. రాఘవేంద్రరావు" దర్శకత్వంలో 'మంచు మనోజ్' కొత్త చిత్రం!
WD
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై "ప్రయాణం" ఫేమ్ మంచు మనోజ్ హీరోగా కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నటుడు మోహన్ బాబు బేనర్‌పై కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 12వ తేదీన లాంఛనంగా ప్రారంభమైంది.
హీరో మంచు మనోజ్‌పై తీసిన తొలిషాట్‌కు దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా, మోహన్ బాబు స్నేహితుడు పద్మభూషణ్ గ్రహీత వరప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
శ్రీ లక్ష్మీ ప్రసన్న పతాకంపై 51వ చిత్రంగా వస్తోన్న మంచు మనోజ్ తాజా చిత్రానికి సంబంధించి ఓ పాటను చిత్రీకరించడం జరిగింది. ఈ పాట చిత్రీకరణ ఆదివారం (నవంబర్ 15)తో పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోహన్ బాబు మాట్లాడుతూ.. 1982లో నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభమైన శ్రీ లక్ష్మీ ప్రసన్న పతాకంపై ఇప్పటికే 50 చిత్రాలను నిర్మించామన్నారు.
కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న "మేజర్ చంద్రకాంత్" చిత్రంలో ఎన్టీఆర్‌తో కలిసి నటించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇదే సినిమాలో బాలనటుడిగా నటించిన మంచు మనోజ్.. హీరో కావడం ఆకతాళీయంగా జరిగిందని మోహన్ బాబు తెలిపారు.
ఈ చిత్రంలో తాను కీలక పాత్ర పోషిస్తున్నానని, ఆ పాత్ర వివరాలను త్వరలో వెల్లడిస్తానని ఆయన అన్నారు. సంగీతభరితంగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమా రేపటి నుంచి (నవంబర్ 16) అవుట్‌డోర్ వెళ్తుందని మోహన్‌బాబు తెలియజేశారు.
మోహన్ బాబు కుమార్తె, చిత్ర నిర్మాత లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ.. తన పేరుతో గల లక్ష్మీప్రసన్న పతాకంపై తొలిసారిగా నిర్మాత సారథ్యం వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాన్న దగ్గర నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నానని.. ఈ సినిమాకు పూర్తిస్థాయి నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని చెప్పారు. ఇందులో 11 పాటలున్నాయని, కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూర్చారని అన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. నాన్నగారు.. ఎన్టీఆర్ చేతులమీదుగా ప్రారంభమైన లక్ష్మీ ప్రసన్న 50 చిత్రాలను నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో పయనించిన కారణంగానే ఇంతటి స్థాయికి ఎదిగామని తెలిపారు. మంచు మనోజ్‌పై తీసిన ఒక సాంగ్‌ను చూశానని, అద్భుతంగా చేశాడని బాలయ్య కితాబిచ్చారు.
కీరవాణి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తో 'మేజర్ చంద్రకాంత్' తర్వాత కె. రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో రానున్న మంచు మనోజ్ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్నారు. మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో క్లాసికల్, ఫ్లోక్ వంటి వివిధ విభాగాల్లో సమకూర్చిన పాటలుంటాయని కీరవాణి తెలిపారు. 80శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన ఈ సినిమా కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుదని కీరవాణి అన్నారు.
ఈ సినిమాలో టాప్‌సి అనే కొత్త హీరోయిన్‌ను పరిచయం చేస్తున్నారు. సుమన్, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి మూలకథ: భూపతి రాజ, కెమెరా: ఎస్. గోపాలరెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే: గోపి మోహన్, దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు, నిర్మాత: లక్ష్మీ ప్రసన్న.