ప్రధాన పేజివినోదం » వెండితెర » కథనాలు » పిల్లలకోసం వేసిన చిత్రాలను వారే ఎందుకు చూడటం లేదు? (16th International Children film festival, Hyderabad, Gopala Krishna)
పిల్లలకోసం వేసిన చిత్రాలను వారే ఎందుకు చూడటం లేదు?
WD
హైదరాబాదులో జరుగుతున్న 16వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించే చిత్రాల గురించి ప్రతివారి మదిలో మెదిలే ప్రశ్న ఇది. చాలామంది పిల్లలు వాటిని సక్రమంగా వినియోగించుకోవడం లేదని పలు పత్రికల్లో వస్తున్న వార్తలపై మంగళవారంనాడు ఐమాక్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో పలువురు వక్తలు తమ స్పందనను వినిపించారు.
ముందుగా సినిమా రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ... 'నేను ఈ రోజు ఓ పేపర్లో చూశాను. పిల్లల సినిమాలను ఎవరూ చూడటం లేదు. ఫ్లాప్ అయిందని. ఎందుకలా రాశారనుకుని ఈ రోజు వచ్చాను. ఐమాక్స్‌లో ప్రదర్శించే మూడు స్క్రీన్లలోనూ సీటులేక నిల్చుని సినిమా చూశాను. మరి అలాంటప్పుడు ఎందుకు అలా వార్తలు రాస్తారు? అని ప్రశ్నించాను.
ఐమాక్స్ మినహా మిగిలిన థియేటర్లలో పిల్లలు లేకపోయి ఉండవచ్చు. అంతమాత్రాన మొత్తం చిత్రోత్సవాల్ని నిందించడం భావ్యం కాద"ని హితవు పలికారు. ప్రధానంగా చెప్పుకోవాల్సింది... ఈనాటి బాలలు చాలా మేధావులు. వారు ఆర్డినరీ థియేటర్లలో సినిమాలు చూడరు. ఐమాక్స్ వంటి అందమైన థియేటర్లలోనే సినిమాలు చూస్తారు అని అన్నారు.
పరుచూరి అభిప్రాయంతో అలనాటి బాలనాటి నేటి యువనటుడు తరుణ్ మాతృమూర్తి రోజారమణి కూడా ఏకీభవించారు. థియేటర్లు కలర్‌ఫుల్‌గా ఉండటంతోపాటు, తినుబండారాలు, ఆటలు ఆడుకునేట్లు ఉపయోగపడే మల్టీప్లెక్స్ థియేటర్లలో పిల్లలు తమ తల్లిదండ్రులతో వస్తారని అన్నారు. లేకపోతే హారీపోర్టర్, స్పైడర్‌మేన్ వంటి చిత్రాలు చూస్తారు తప్పితే... ఆ పరిధిని మించి వివిధ దేశాలు ప్రదర్శించే సినిమాలు చూడరని తేల్చి చెప్పారు.
మన ఇండియాలో పిల్లలు రాకపోవడానికి బడ్జెట్ ప్రాబ్లమ్‌తో పాటు దీనిని వ్యాపారంగా నిర్మాతలు చూసుకోవడం కారణంగా పేర్కొన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఇరాన్ దేశంలో ఇచ్చినట్లు రాయితీలు మరింత పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అరుంథతి బాలనటి బేబి దివ్య మాట్లాడుతూ... "నేను మూడేళ్లనాడు నటించిన చిత్రంలో బాలనటిగా నాకు నంది అవార్డు ఇచ్చారు. అదృష్టంగా భావిస్తున్నాను.
బాలల చిత్రాలు బాలలే చూడలేకపోవడానికి కారణం... వారికి యానిమేషన్, సూపర్‌మేన్ వంటి చిత్రాలపై ఉన్న ఆసక్తి మిగిలిన చిత్రాలపై అంతగా ఉండదు. మహాత్మాగాంధీ గురించి పుస్తకాల్లో చదివినప్పుడు ఆ రోజుల్లో అలా చేశారా...? అనిపిస్తుంది కానీ, అదే పాఠ్యాంశాన్ని చిత్రంగా చూస్తే... అందులో ఎంత కష్టపడిందీ కళ్లకు కట్టినట్లు ఉండటంతో పిల్లల మనస్సుల్లో ప్రగాఢంగా నాటుకుపోతుందని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం, నిర్మాతలు చొరవ చూపితే నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.