ఒక్క ఫైట్ లేకుండా 'లీడర్' సినిమా తీశాను: శేఖర్ కమ్ముల
WD
ఒక ఫైట్ లేకుండా, ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా "లీడర్" సినిమాను తీశానని దర్శకుడు శేఖర్‌కమ్ముల తెలిపారు. తన జీవితంలో మంచి సినిమా తీశానంటే అది 'లీడర్' మాత్రమేనని నమ్మకంగా చెబుతున్నానన్నారు.
డా. డి. రామానాయుడు మనుమడు, సురేష్‌బాబు కొడుకు "రానా"ను హీరోగా పరిచయం చేస్తూ ఏవీఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థ 'లీడర్' చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం ఆడియో వేడుక అంగరంగవైభవంగా జరిగింది.
ఆదివారం హైదరాబాద్‌లోని మారియచ్ (వైశ్రాయ్)లో జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోమవారం నాడు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఆయన చాలాసేపు ఈ కార్యక్రమంలోనే గడిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ రానానుద్దేశించి చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది.
కష్టమే కాపాడుతుంది: చిరంజీవి 'లీడర్' ఆడియోఫంక్షన్‌కు వస్తే.. రామ్‌చరణ్‌తేజ ఆడియో ఫంక్షన్‌కు వచ్చినంత ఫీల్ కలిగింది. రానా నా ఇంట్లోనే తిరిగేవాడు. చరణ్‌కు ఫ్రెండ్. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావ్? అని అడిగితే.. కార్పొరేట్ వ్యాపారం అనేవాడు. అంటే వాళ్ళనాన్నగారిలా అవుతాడనుకున్నాను. కానీ రామానాయుడుగారికి హీరోను చేయాలని ఉందని నాతో చెప్పేవారు.
కుర్రవాళ్లుకదా ఏవో ఆలోచనలో ఉంటారు. నిదానంగా మారతాడు ఏని చెప్పాను. అలానే మారాడు. సినిమా హీరో విలువ తెలుసుకాబట్టే రానా హీరో అయ్యాడు. అభిమానం ఎంత శక్తినిస్తుందో రానా త్వరలోనే గ్రహిస్తాడు. మొదటి సినిమానే గొప్పబేనర్‌లో రావడం విశేషం కాదు. ఆ తర్వాత నువ్వేంటి? అనేది నిరూపించుకోవాలి. నీలోపల ఉన్న టాలెంట్ బయటకు రావాలి. చాలా కష్టపడాలి. అదే నిన్ను కాపాడుతుందని రానాకు సూచించారు.
రానాను, నాగచైతన్యలను ఆశీర్వదించండి: రామానాయుడు "ఈ రోజు నేనేంతో సంతోషంగా ఉన్నాను. ఎప్పుడూ నెం.1గా ఉండాలనుకునే నేను.. 1963లో రాముడు-భీముడు సినిమా తీశాను. ఆ తర్వాత మా వారసునిగా సురేష్‌బాబు పరిచయం చేయాలనుకున్నాను.
నాకు ఇంట్రెస్ట్‌లేదన్నాడు. అప్పుడు విదేశాల్లో ఉన్న వెంకటేష్‌ను అడిగాను. ఇంట్రెస్ట్ చూపాడు. కలియుగపాండవులు 86లో తీశాం. సక్సెస్ అయింది. ఇప్పుడు దగ్గుబాటి రానా వస్తున్నాడు. మరో మనుమడు నాగచైతన్యను కూడా అందరూ ఆశీర్వదించండి" అని కోరారు.
రానాను సాదరంగా ఆహ్వానించండి: వెంకటేష్ ఎన్నో సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న అభిమానులు, ప్రేక్షకులు రానాను కూడా వెండితెరకు సాదరంగా ఆహ్వానించండని వెంకటేష్ కోరారు. ఇంరకా ఈ కార్యక్రమంలో సినీరంగ ప్రముఖులు హాజరయ్యారు. అక్కినేని నాగార్జున, అల్లు అర్జున్, విష్ణు, అశ్వనీదత్, కోటశ్రీనివాసరావు, అల్లు అరవింద్ తదితరులు రానా ఆశీర్వదించారు.
ఇదిలా ఉంటే.. రానా చిత్రం తీయడానికి చాలా కాలం పట్టింది. దీని గురించి శేఖర్‌కమ్ముల సమాధానమిస్తూ.. లీడర్ చిత్రంపై బయట చాలా ప్రచారం జరుగుతుంది. రామానాయుడు, సురేష్‌బాబుని పట్టుకుని శేఖర్‌కమ్ముల సినిమా తీస్తున్నాడని మధ్యలో ఏదో జరిగిందని ఏవేవో వార్తలొస్తున్నాయి.
అసలు విషయం సంగతికి వస్తే.. "హ్యాపీడేస్ తర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. ఏం చేయాలి? ఎటువంటి సినిమా తీయాలని తెగ ఆలోచించాను. దానికే రోజులు గడిచాయి. ఆరునెలలు టీవీకే అతుక్కుపోయాను. అప్పుడే ఎన్నికలు మొదలయ్యాయి. అప్పుడే ఆలోచన పుట్టింది. దేశం, రాష్ట్రం "హ్యాపీడేస్"గా ఉండాలంటే.. సరైన "లీడర్" కావాలి అనిపించింది. దానిలోంచి పుట్టిన కథే ఈ సినిమా. రాజకీయనాయకుడికి, లీడర్‌కు మధ్య గల తేడా ఏమిటి? అనేది ఈ చిత్రంలో చూడాల్సిందే. ఏ రాజకీయ చిత్రం వచ్చినా అది ఇక "లీడర్" తర్వాతే అవుతుంది" అని శేఖర్ కమ్ముల తెలిపారు.
కథలో రాసినట్లే సి.ఎం. చనిపోతారు..! మరోవైపు "లీడర్" ఆడియో ఫంక్షన్లో ఈ చిత్ర కథ గురించి పలురకాలుగా మాట్లాడుకోవడం జరిగింది. ఈ సినిమా కథ గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. తాను రాసుకున్న కథలో కొన్ని సంఘటనలు జరిగాయి. అలాగే దురదృష్టసంఘటనలు జరిగాయని తెలిపారు. దీంతో కథలో... జనాకర్షణ ఉన్న నేత రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకోకుండా మరణిస్తారు. ఆయన వారసునిగా ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అవుతారు. అది సినిమాలో ఉందట. కానీ నిజజీవితంలో అది జరగలేదు కాబట్టి.. రాజశేఖరా.. అంటూ పాటను పెట్టారని తెలిసింది.
'లీడర్' ఆడియో ఫంక్షన్ సైడ్‌లైట్స్: వ్యాఖ్యాత సుమ సభను నడిపారు. లీడర్ ఎలా ఉండాలి? రాజకీయనాయకులు ఎంతగా దిగజారుతున్నారంటూ.. బి.ఎన్.రెడ్డి, ఎం.ఎస్. రెడ్డిలు వ్యాఖ్యానిస్తూ.. రాజకీయనాయకులు డబ్బుకోసం కాదు దేశానికి సేవచేయడానికి ముందుకు రావాలనే విషయాన్ని ఈ చిత్రం చెబుతుందనగానే.. వెంటనే అక్కడ కూర్చున్న చిరంజీవి వైపు కెమెరాలు పెట్టి స్టేజీ ముందు పెట్టిన స్క్రీనింగ్‌లో మెగస్టార్‌ను చూపించడం విశేషం. దాంతో కాసేపు అంతా నవ్వుకున్నారు.
పాటలను విడుదల చేస్తూ.. ఒక్కో పాటకు సంబంధించిన డాన్స్‌లు అక్కడి నృత్యకారులు చేశారు. చివరి పాటగా ఐటమ్‌సాంగ్ వచ్చింది. "రాజశేఖరా.. నిను మరువలేనురా.." అంటూ చూపించారు. ఆ పాటను ఉదయభానుపై చిత్రించారు. ఆ పాట వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డిని ఉద్దేశించి రాసినట్లు తెలిసింది.