ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక దర్శకుడిగా గిన్నిస్ రికార్డ్ సాధించిన దర్శకరత్న డా. దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తున్న 149వ చిత్రం "యంగ్ ఇండియా" షూటింగ్ నవంబర్ 22 న రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది.
సిరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శ్రీమతి దాసరి పద్మ సమర్పణలో రామకృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 35 ఏళ్ళ క్రితం నవంబర్ 22న దాసరి అందరూ కొత్తవారితో తీసిన "స్వర్గం-నరకం" రిలీజ్ అయి సెన్సేషనల్ హిట్ కాగా, ఈ నవంబర్ 22న యంగ్ ఇండియా ప్రారంభం కావడం విశేషం. నాటి "స్వర్గం-నరకం"తో పరిచయం అయిన మోహన్ హాహు ఈ యంగ్ ఇండియాకు క్లాప్ కొట్టడం మరో విశేషం.
పద్మశ్రీ డా. మోహన్ బాబు క్లాప్, సుప్రీమ్ డైరక్టర్ రవిరాజా పినిశెట్టి స్విచ్ఛాన్‌తో 'యంగ్ ఇండియా' షూటింగ్ ప్రారంభమైంది. గతంలో డా. దాసరి సెన్సేషనల్ హిట్స్ ఒసేయ్ రాములమ్మా, ఒరేయ్ రిక్షా చిత్రాలకు క్లాప్ స్విచ్ఛాన్ చేసిన మోహన్ బాబు, రవిరాజాలు యంగ్ ఇండియాకి క్లాప్, స్విచ్ఛాన్ చేయడం ఇంకో విశేషం.
యంగ్ ఇండియా ప్రారంభోత్సవం సందర్భంగా దాసరి మాట్లాడుతూ.. మన ఇండియాలో ఉన్న హ్యుమన్ రిసోర్సస్‌ని అమెరికా, యుకె వంటి దేశాలు బాగు ఉపయోగించుకుంటున్నాయి. యువత కేవలం ఎంప్లాయ్‌మెంట్‌కే కాదు. దేశ భవిష్యత్తుకి కూడా దిక్సూచి కావాలి. ప్రస్తుత దేశ పరిస్థితులకు "యంగ్ ఇండియా" ఎలా దిక్సూచి అవ్వాలన్నదే ఈ చిత్ర కథాంశమన్నారు.
అందరూ కొత్తవారితో తీస్తున్న ఈ చిత్రంలో నటించడానికి 22 వేల మందికి పైగా అప్లికేషన్స్ పంపించారు. కొన్ని నెలలపాటు వాటిని పరిశీలించి అందులో 549 మందిని ఇంటర్వ్యూలు చేసి ఫైనల్‌గా 81 మందిని సెలెక్ట్ చేశాం. ఈ 81 మందికి నటనలో, డాన్స్‌లో రెండు నెలలపాటు అన్ని విధాలా శిక్షణ ఇచ్చాం. ఇందులో ఆరుగురు హీరోలు, ఆరుగురు హీరోయిన్లు, ఆరుగురు సపోర్టింగ్ ఆర్టిస్టులు.. ఇలా మొత్తం 81 మంది కొత్తవాళ్ళని ఒకేసారి పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది.
తెలుగు వచ్చిన హీరోయిన్స్ దొరకడం లేదు అనే వారికి యంగ్ ఇండియా సమాధానం చెబుతుంది. ఇందులో హీరోయిన్స్‌గా పరిచయం అవుతున్న ఆరుగురూ తెలుగువాళ్ళే. మీడియాలో అచ్చ తెలుగు మాట్లాడే తెలుగింటి ఆడపడుచులేనని వివరాలందించారు.
నిర్మాత రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ఏకధాటిగా 60రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్, విశాఖపట్నం, ముంబైలలో జరుగుతుంది. మధ్యలో ఐదు రోజులు దాసరి పార్లమెంట్ వెళ్తారు. ఆ చిన్న గ్యాప్ తప్పితే షూటింగ్ ఆల్‌మోస్ట్ సింగిల్ షెడ్యూల్‌లో పూర్తవుతుంది. ఎన్నో రికార్డులు సృష్టించిన దాసరి ఒకే చిత్రంలో 81 మంది కొత్త ఆర్టిస్టుల్ని పరిచయం చేస్తూ మరో రికార్డు సృష్టంచారు.
చాలా కాలం తర్వాత మళ్ళీ దాసరి, కీరవాణి కలిసి పనిచేస్తున్నారు. మ్యూజికల్‌గా కూడా చాలా ప్రాధాన్యత ఉన్న చిత్రమిది. ఆరుపాటల్లో ఆల్‌రెడీ నాలుగు పాటల రికార్డింగ్ పూర్తయింది. సెన్సేషనల్ స్టోరీతో దర్శకరత్న దాసరి రూపొందిస్తున్న "యంగ్ ఇండియా" తెలుగు ఇండస్ట్రీలో ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేస్తుందన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, కెమెరా: సి.హెచ్. రమణరాజు, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్ డైరక్టర్: బి. వెంకటేశ్వరరావు, ఫైట్స్: రాఖీ రాజేష్, రామ్‌లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి. జగదీష్ చంద్రప్రసాద్, నిర్మాత: రామకృష్ణప్రసాద్, సమర్పణ: దాసరి పద్మ, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: డా. దాసరి నారాయణరావు.