1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Praja Natyamandali

Narra Venkateswara Rao | Praja Natyamandali | Tammareddy Krishnamurthy | నర్రా నిబద్ధతగల కళాకారుడు

నర్రా వెంకటేశ్వర రావు
వ్యాపార లక్షణాలతో విరాజిల్లే సినీ పరిశ్రమలో నర్రా ఒక నిబద్దతగల కళాకారుడిగా తుదిశ్వాస వరకూ బతికారనీ, అటువంటి వ్యక్తిత్వాన్ని అలవర్చింది ప్రజానాట్యమండలేనని ప్రముఖ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి అగ్రజులు తమ్మారెడ్డి కృష్ణమూర్తి పేర్కొన్నారు.

ఈ నెల 28న ఫిలిమ్ ఛాంబర్‌లో ఆంధ్రప్రజానాట్యమండలి చలనచిత్ర ఆధ్వార్యాన జరిగిన నర్రా సంతాపసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సినీ దర్శకుడు, ప్రజానాట్యమండలి చలనచిత్ర అధ్యక్షుడు బాబ్జీ అధ్యక్షతన జరిగిన సంతాప సభలో సంస్థ ప్రధాన కార్యదర్శి మద్దినేని రమేష్, సహాయకార్యదర్శి మోహన్ గౌడ్‌లు శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ప్రజానాట్యమండలి రీతిలో నిర్వహించారు.

సీనియర్ దర్శకుడు పి. చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ... నర్రా విలనిజాన్ని ప్రదర్శించినా నిజజీవితంలో మాత్రం సమాజంలోని వివిధ రకాల విలనిజాలకు వ్యతిరేకంగా ప్రజాకళాకారుడిగా పోరాడేవారనీ, విద్యార్థి దశ నుండి ఆయనలో పోరాట తత్త్వం ఉందనీ, ఆయనా తను కలిసి మదరాసులో 15 సంవత్సరాలు ఒకే గదిలో నివశించామనీ, పెళ్లయి సినీ పరిశ్రమలో స్థిరపడిన తర్వాత పక్కపక్కనే ఇళ్లు నిర్మించుకున్న స్నేహం తమదని వివరిస్తూ కన్నీళ్ల పర్యంతమయ్యారు.

సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ... నర్రా మరణవార్తను తట్టుకోలేకున్నాననీ, మనస్సును ఇతర అంశాలవైపు మరల్చుకుని దుఃఖాన్ని దిగుమింగుకుందామని ఎంత ప్రయత్నించినా నర్రా తలపులు తనను వదలటం లేదని అన్నారు.

నర్రా సహచరులు నిర్మాత పోకూరి బాబూరావు మాట్లాడుతూ... ప్రజానాట్యమండలి నుంచి సినిమా పరిశ్రమకు వెళ్లినవారికి నర్రా మార్గదర్శిగా నిలిచి అవసరమైన సూచనలు సహాయసహకారాలు అందించేవారనీ, ఆయన మరణంతో కుటుంబ సభ్యుణ్ణి కోల్పోయిన భావనలో ఉన్నానన్నారు.

ఇంకా వీరితోపాటు భీమినేని శ్రీనివాసరావు, మాదాల రంగారావు కూడా నర్రాను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సినీ నటులు కవిత, జయశీల, ప్రజానాట్యమండలికి చెందిన పలువురు కళాకారులు హాజరై నర్రాకు జోహార్లు అర్పించారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT