1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Dasari Narayana Rao

Mohan babu | Dasari Narayana Rao | Cinema Industry | Tollywood | Telangana Issue | మోహన్ బాబు మాటలకు ఎవరికైనా మండుతుంది: దాసరి

దాసరి నారాయణరావు
WD
అనవసరంగా ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు భయపడిపోయి కోట్ల రూపాయల్లో చేతి చమురు వదులుకున్నారని దాసరి నారాయణరావు తన సన్నిహితులతో అన్నారు. గత కొద్దికాలంగా ఇండస్ట్రీపై జరుగుతున్న దాడుల గురించి పలువురు రకరకాలుగా స్పందిస్తున్నా ఇండస్ట్రీ పెద్దగా మీరు స్పందిస్తే బాగుండేది అని కొంతమంది అడిగినప్పుడు ఆయన సన్నిహితుల వద్ద ఇలా అన్నారు.

ఏదైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాలి. వాస్తవం ఏమిటో తెలియకుండా ఎవరిష్టం వచ్చినట్లు వారు ఉద్యమకారులను నిందించడం సమంజసం కాదని పేర్కొన్నారు. అల్లు అరవింద్ కార్యాలయాన్ని ఆక్రమించి తెలంగాణా భవన్‌గా మార్చడం వెనుక వేరే కథ ఉందన్నారు. సదరు వ్యక్తి నుంచి అరవింద్ 5 కోట్ల రూపాయలు వసూలు చేసి అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందునే అది జరిగిందన్నారు.

మోహన్ బాబుకు అంత ఆవేశం పనికిరాదు...
సమైక్యవాదం తన అభిప్రాయమని చెప్పిన మోహన్ బాబు తన షూటింగ్‌పై గొడవ చేసినప్పుడు అంత ఆవేశంగా మాట్లాడి ఉండకూడదు. దానిపట్ల సానుకూలంగా స్పందించాలి. ఆవేశంగా సవాల్ విసిరితే ఎవరికైనా మండుతుంది. ఆయనేమీ రాజకీయ నాయకుడు కాదు కదా... అలాంటప్పుడు అంత ఆవేశం ఎందుకు...?

జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై దాడికి ఆయన తండ్రి హరికృష్ణ చేసిన సమైక్య వ్యాఖ్యలు కారణం. ఇక మహేష్ బాబు షూటింగ్‌పై దాడి అంటే.. దానికీ ఓ కారణముంది. పద్మాలయ స్టూడియోను వేరేవారికి అద్దెకివ్వడం వంటి కొన్ని ఘటనలు దాడికి పురిగొల్పాయి.

ఇక చిరంజీవి రాజకీయనాయకుడుగా తప్పిదం చేశాడు. అందరూ మనవాళ్లే అన్నప్పుడు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి...? అనేది కూడా చిరంజీవికి తెలియలేదు... అంటూ రెండు పడవలపై కాళ్లు పెట్టమన్నట్లు వ్యాఖ్యానించారు.

అన్ని షూటింగ్‌లు ఆపేసి ఆర్నెల్లు కూచోవాలి...
షూటింగ్‌ల‌పై దాడికి విరుగుడుగా తను ఎప్పటినుంచో ఒక పరిష్కారం చెపుతున్నాని అన్నారు. అంతా షూటింగ్‌లు మానేసి ఆరునెలల పాటు ఊరకనే కూచోవడమే. అప్పుడే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తెగింపు చేసి నిర్మాతలను బతికించుకునేవారు. అది చేయాల్సింది పోయి.. ఎవరిష్టం వచ్చినట్లు వారు స్టేట్‌మెంట్స్ ఇవ్వడం.. ఇండస్ట్రీని సరైన విధంగా గైడ్ చేసేవాడు లేకపోవడం వల్లనే ఇదంతా జరిగింది.

ఇండస్ట్రీ పెద్దలు చాలామంది ఉన్నారు. రామానాయుడు, రాఘవేంద్రరావు, రాజమౌళి, వినాయక్ ఇంకా కొంతమంది పేరున్న డిస్ట్రిబ్యూటర్లు, ఛాంబర్ అధ్యక్షులు ముందుకు వచ్చి దాడులపై వెంటనే స్పందిస్తే బాగుండేదని తన మనసులోని మాటలను తన సన్నిహితులతో చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT