తెలంగాణలో తెలుగు చిత్రాలను ఆదరిస్తారు: "అదుర్స్" నిర్మాత
దయచేసి సినిమాలపై రాజకీయాలు రుద్దకండి: వల్లభనేని
WD
నిన్న తెలంగాణా జాగృతి సమితి అధ్యక్షురాలు కవిత "అదుర్స్" చిత్రాన్ని కొనకండని డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు డిమాండ్ చేసిన నేపథ్యంలో మంగళవారం వల్లభనేని మీడియాతో మాట్లాడారు. "కళాకారులకు భేధాభిప్రాయాలు లేవు. ఇప్పటికే ఎన్టీఆర్ తన అభిప్రాయమేమిటో? చెప్పేశారు. నేను ఇక్కడివాడినే. నాకు అందరూ కావాలి. ఇంకా కళాకారులకు భాషాభేదాలు లేవు" అని అదుర్స్ నిర్మాత అన్నారు.
"నిజానికి అసలు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలా? వద్దా? అనేది యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ చేతుల్లో ఉంది. కాంగ్రెస్ పెద్దపార్టీ. ఆ తర్వాత బీజేపీ.. ఆ రెండు పార్టీలు ఏవైనా చేయగలవు. మొన్న నేను, కొడాలి నాని కలిసి మా గన్నవరంలో ఎడ్లపందాలు నిర్వహించాం. దానికి రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి పందాలు అని పేరుపెట్టాం. ప్రతి ఏడాది చేస్తూనే ఉంటాం. తెలంగాణాకు చెందిన రైతులు కూడా ఇందులో పాల్గొన్నారు. అంతా సఖ్యంగా ఎప్పటినుంచో ఉంటున్నాం. తెలంగాణకు చెందిన దామోదర్‌రెడ్డి ఎడ్లుకూడా ఈ పోటీల్లో పాలుపంచుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాల విషయంలో ఎందుకీ వివక్షత. దయచేసి సినిమాలపై రాజకీయాలు రుద్దకండి" అని నిర్మాత వల్లభనేని అన్నారు.
ఇదిలా ఉండగా.. వంశీ, కొడాలి నాని కోరిక మేరకు రాష్ట్ర డీజీపీ తెలంగాణలో "అదుర్స్" చిత్రానికి ఆటంకాలు లేకుండా తగిన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని హైకోర్టుకు కూడా తెలియజేశారు.
