1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cinema

Gummadi Venkateswara Rao | Cinema | Actros | Actresses | Politiciens | "గుమ్మడి"కి సినీ-రాజకీయ రంగం ఘన నివాళి

గుమ్మడి వెంకటేశ్వరరావు
WD
తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన గుమ్మడి వెంకటేశ్వరరావు మంగళవారం అర్థరాత్రి 11.30 గంటలకు గుండెపోటుతో కేర్ ఆసుపత్రిలో మరణించారు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్‌లోని పబ్లిక్ స్కూల్‌కు ఎదురుగాగల స్వగృహంలో ఉంచారు.

బుధవారం రాత్రి 10 గంటలవరకూ ఇక్కడే ఉంచుతామనీ, గురువారంనాడు గుమ్మడి స్వగ్రామమైన గుంటూరు జిల్లా వేమూరు మండలం రావికంపాడు గ్రామంలో అంత్యక్రియలు జరుపనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు.

బుధవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య కేర్ ఆసుపత్రికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని దర్శించారు. గుమ్మడిగారిది తనదీ పక్కపక్క గ్రామాలనీ, యాదృశ్చికంగా తమ పొలం ప్రక్క పొలం ఆయనది అన్నారు. మంచి నటుడు, ఆత్మీయుడిని కోల్పోయానని పేర్కొన్నారు. గుమ్మడి భౌతికకాయాన్ని పలువురు రాజకీయ నాయకులు, సినీరంగ ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు.

గుమ్మడి గొప్ప కళారుడు: నారాయణ (సీపీఐ)
గుమ్మడిగారు గొప్ప కళాకారుడు. సమాజాన్ని దిశానిర్దేశం చేసే కమ్యూనిస్టు పార్టీ పాలసీని అవపోసన పట్టినవారు. 50వ దశకంలోనే కళాకారులను సమీకరించి సాంస్కృతిక రంగాన్ని చైతన్యవంతులను చేశారు. మాతృసంస్థ ప్రజానాట్యమండలి పట్ల ఎనలేని గౌరవం కలిగిన ఆయన నటజీవితంలో ఎంతో మంచిపేరు సంపాదించుకున్నారు.

ప్రజానాట్యమండలి కళాకారుడిగా సినిమా ఎదుగుదలకు ఎంతో దోహదపడ్డారు. ఆయన ప్రజలకు ఎంతో చేరువయ్యారు. దివంగతులయ్యేముందు వరకూ మాకు ఆయనతో చక్కని సంబంధాలున్నాయి. కళ అనేది ప్రజలకోసమేననీ త్రికరణశుద్ధిగా నమ్మి తన విధిని నిర్వర్తించారు. ఆయన చనిపోవడం విచారాన్ని కల్గిస్తుంది. సీపీఐ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

ప్రజల్లో స్ఫూర్తిని పెంచారు: జి. మల్లేష్ (సీపీఐ)
కళాకారుడిగా ప్రజల్లో స్పూర్తిని పెంచారు. ఆయనకు హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. రావు నరసింహరావు- గుమ్మడి లేరనడం తీరని లోటని పేర్కొన్నారు.

కుటుంబ సభ్యుడిగా కలిసిపోయారు: తమ్మారెడ్డి కృష్ణమూర్తి
సహజ నటనతో మెప్పించారు. కుటుంబ సభ్యుడిగా కలిసిపోయారు. బంగారు గాజులు, ధర్మదాత వంటి చిత్రాల్లో ఆయన నటన అపూర్వం. వామపక్ష రాజకీయాలవైపు మొగ్గుచూపి వారితో ఎంతో సన్నిహితంగా మెలిగేవారు.

నిర్మొహమాటంగా మాట్లాడేవారు: చంద్రబాబు(తెలుగుదేశం)
నాకు గుమ్మడిగారు చాలా ఏళ్లుగా తెలుసు. పెద్ద మనిషి. నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి. 500 సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితుడు. సహజ నటుడు. నటనకే వన్నె తెచ్చారు. ఆయన స్పూర్తితో అందరూ కళకు పునరంకితం కావాలి.

దత్తాత్రేయ( భాజపా)
ఎన్టీఆర్, ఏఎన్నార్, రేలంగి తర్వాత గుమ్మడి వంటివారు తెలుసు. ఆయన అందరితో బాగా సంబంధాలు ఏర్పరుచుకున్నారు. పింగళి వెంకయ్య అవార్డును ఏడుసార్లు దక్కించుకున్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నా.

బీవీ రాఘవులు ( సీపీఎం)
తెలుగు సినిమా రంగాన్ని ఉర్రూతలూగించిన నటుడాయన. సాంస్కృతిక రంగానికి ఎనలేని సేవ చేశారు. మార్కిస్టు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.

అల్లు అరవింద్ (పీఆర్పీ)
చిరంజీవి గుంటూరులో ఉన్నందువల్ల రాలేకపోవడంతో అల్లు అరవింద్ గుమ్మడి భౌతికకాయాన్ని దర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. తన నాన్నగారు అల్లు రామలింగయ్యకు ఆప్తులని, అలనాటి మాయాబజార్‌లో 40 ఏళ్ల గుమ్మడి ఎంతో కలర్‌ఫుల్‌గా ఉన్నారన్నారు. అది చూసి తనకు ఆశ్చర్యమేసిందన్నారు.

జయప్రకాష్ నారాయణ్ ( లోక్ సత్తా)
కొంతమంది సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా పుడతారు. అటువంటివారిలో గుమ్మడి ఒకరు. సమాజం బాగుపడాలంటే మార్పురావాలనేవారు. ఆయనతో చాలాసార్లు చర్చల్లో పాల్గొన్నా.

అక్కినేని నాగేశ్వరరావు
సినీ పరిశ్రమ యావత్తూ ఆయన అంతిమయాత్రలో పాల్గొనాలి. ఆయన నిబద్ధతగల మనిషి. మంచి ఆత్మీయుడు. 80 ఏళ్లు వచ్చాక అందరూ పోయేవారే. కాకపోతే కొందరు అటూ.. ఇటూ.. ఏమైనా ఓ గొప్ప స్నేహితుడిని కోల్పోయాను.

కృష్ణ
నేను హీరోగా చేస్తుండగా ఆయన నాతో చాలా చిత్రాల్లో పనిచేశారు. స్వంత బ్యానర్ స్థాపించినప్పటినుంచి చాలా చిత్రాల్లో మా బ్యానర్లో నటించారు. మంచి హృదయంగల వ్యక్తి.

మురళీమోహన్
గుమ్మడి మృతి కళారంగానికి తీరని లోటు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఆయన చాలా సలహాలిచ్చేవారు.

కైకాల సత్యనారాయణ
గుమ్మడి భౌతిక కాయాన్ని చూసి భోరున విలపించారు. ఏమీ మాట్లాడలేకపోయారు.

జమున
నన్ను కన్నకూతిరుకంటే ఎక్కువగా చూసుకునేవారు. ఎన్నో చిత్రాల్లో కలిసి నటించాం. తండ్రిగా పలు చిత్రాల్లో నటించాం. ఆయన నిండుదనం ఎవరికీ రాదు.

వీరితోపాటు ఇంకా పలువురు ప్రముఖులు డి. సురేష్ బాబు, రామానాయుడు, రామ్ చరణ్ తేజ, లక్ష్మీ ప్రసన్న, రాఘవ, భువనేశ్వరి, పురంధరేశ్వరీ, వసుంధర, ఎన్టీఆర్, చలపతిరావు, రాజా, గీతాంజలి, జయసుధ, తనికెళ్ల భరణి, నరేష్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, నరేష్ తదితరులు గుమ్మడి స్మృతులను నెమరివేసుకున్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT