1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. లతా మంగేష్కర్‌కు ప్రపంచరత్న అవార్డు ఇవ్వాలి: అక్కినేని

Latamangeshkar, Akkineni Award, Vilasrao Desmukh, Rosaiah, ANR | లతా మంగేష్కర్‌కు ప్రపంచరత్న అవార్డు ఇవ్వాలి: అక్కినేని

లతా మంగేష్కర్
ప్రముఖ హిందీ నేపధ్య గాయనీమణి, భారతరత్న లతా మంగేష్కర్‌కు సోమవారం అక్కినేని అవార్డును ప్రదానం చేశారు. హైదరాబాదులోని తాజ్ కృష్ణలో జరిగిన ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య, అక్కినేని నాగేశ్వరరావుతోపాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ... లతా మంగేష్కర్ గానానికి ఓ శక్తి ఉన్నదనీ, ఆమె పాటలు వింటే శరీరం కొత్త శక్తిని పొందుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల రాష్ట్రాన్ని ముంచెత్తిన వరద బాధితుల సహాయార్థం రూ. 5 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లు చెప్పారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీకాళహస్తిలో నెలకొల్పాలనుకున్న డ్రీమ్ ప్రాజెక్టైన పవర్ ప్రాజెక్టును త్వరలో చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడుతూ... హైదరాబాదులో ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయనీ, కానీ వాటిలో నేడు జరిగిన లతా మంగేష్కర్ అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమాలు వంటివి మాత్రమే చిరస్థాయిగా గుర్తుండిపోతాయన్నారు.

విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ రెండు వరాలను రాష్ట్రానికి ప్రసాదించారనీ, మొదటిది వరద బాధితుల సహాయం కాగా రెండోది శ్రీకాళహస్తిలో పవర్ ప్రాజెక్టు అని చెప్పారు. పవర్ ప్రాజెక్టు ద్వారా వేలమందికి ఉపాధి లభ్యమవుతుందన్నారు.

అక్కినేని అవార్డును తనకు బహూకరించడం ఎంతో ఆనందంగా ఉన్నదని లతా మంగేష్కర్ ఆనందం వ్యక్తం చేశారు. తన కెరీర్ తొలి నాళ్లలో తెలుగు పాటలు కూడా పాడానని గుర్తు చేసుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావుగారి నటన అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. అక్కినేని మాట్లాడుతూ... లతా మంగేష్కర్‌కు ప్రపంచ రత్న అవార్డునివ్వాలన్నారు. ఆమె గాన ప్రతిభ వెలకట్టలేనిదని కొనియాడారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT