విక్టరీ వెంకటేష్, గ్లామరస్ స్టార్ త్రిష జంటగా డి. సురేష్‌బాబు సమర్పణలో విడుదలైన సినిమా "నమో వెంకటేశ". సురేష్ ప్రొడక్షన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో నూతన నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన "నమో వెంకటేశ" చిత్రం సంక్రాంతి పర్వదినాన విడుదలై రాష్ట్రమంతటా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది.
యువ సంచలన సంగీత కెరటం దేవీశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ చిత్రం ఆడియో ఘన విజయం సాధించి సినిమా సక్సెస్‌కి ఎంతగానో దోహదపడింది. ఈ సందర్భంగా ఫిబ్రవరి ఐదో తేదీన హైదరాబాద్ కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌ని ఘనంగా జరిపారు.
ఈ కార్యక్రమంలో హీరో విక్టరీ వెంకటేష్, దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట, అనీల్ సుంకర, కథా రచయిచ గోపి-మోహన్, కెమెరామెన్ ప్రసాద్ మురెళ్ల, గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి, నటులు కాశీవిశ్వనాథ్, సురేష్, జి.వి. వెంకీ, భ్రమరాంబ, థియేటర్ మేనేజర్ వాసు తదితరులు వేదికపై ఆశీనులవగా ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి దయానంద్ పుష్పగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. "చంటి నుంచి "గణేష్", "లక్ష్మి", "తులసి", "నమో వెంకటేశ" వరుసగా నా చిత్రాలన్నిటిని ఆదరిస్తూ పెద్ద హిట్ చేస్తున్న అభిమానులకు, ప్రేక్షకులను నా కృతజ్ఞతలు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు. శ్రీను వైట్ల టీమ్ అంతా కలిసి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. సంక్రాంతి సీజన్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని సూపర్‌హిట్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. జీవితంలో ప్రతి ఒక్కరూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వుండాలని కోరుకుంటూ ఇలాగే ముందు నా చిత్రాలన్నీ ఆదరించాలని ఆశిస్తున్నాను" అన్నారు.
దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ.. "నాకు చాలా ఇష్టమైన హీరో వెంకటేష్‌గారు. ఆయనతో ఎప్పట్నుంచో సినిమా చేద్దాం అని ఎదురుచూశాను. అది "నమో వెంకటేశ"తో నెరవేరింది. ఎప్పుడూ మాస్‌లో కూర్చుని సినిమా చూడాలంటే ఇష్టం. అక్కడే కిక్ ఉంటుంది. ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేసినందుకు చాలా ఆనందంగా వుంది. ఆడియన్స్ అందరికీ నా కృతజ్ఞతలు" అని తెలిపారు.
నిర్మాతలు రామ్ ఆచంట, అనిల్ సుంకరలు మాట్లాడుతూ.. ఆడియో పెద్ద హిట్ అయింది. సాంగ్స్ అన్ని చాలా రీచ్‌గా చిత్రీకరించాం. సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో దానికి ఈ ఫంక్షనే నిదర్శనం. మళ్లీ వందరోజుల వేడుకలో ప్రేక్షకులను కలుసుకుంటాం" అని వెల్లడించారు.
నటుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ.. "రాజకీయ నాయకులకు ఓట్లు కావాలి, మాకు థియేటర్లే దేవాలయాలు, ప్రేక్షకులే దేవుళ్ళు. శ్రీను వైట్ల మైండ్ గేమ్, వెంకటేష్ బాడీలాంగ్వేజ్ కలగలిపిన చిత్రం "నమో వెంకటేశ". ఈ చిత్రం 175 రోజులు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని చెప్పారు.
అనంతరం గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. "ఆంధ్రప్రదేశ్ అంతటా నమో వెంకటేశ పేరు చాలా ప్రసిద్ధం. అదే టైటిల్‌తో వచ్చిన "నమో వెంకటేశ" చిత్రం పెద్ద హిట్ అయ్యింది. వెంకటేష్ ఏ చిత్రం చేసినా అది హిట్ అవుతుంది. కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ ఏ చిత్రమైనా శ్రీను వైట్ల అద్భుతంగా తీస్తారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు" చెప్పారు.
కెమెరామెన్ ప్రసాద్ మురెళ్ళ మాట్లాడుతూ.. "శ్రీను వైట్ల కామెడీని అద్భుతంగా చిత్రీకరించారు. సినిమా చూసి ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నమో వెంకటేశ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరి ధన్యవాదాలు" అన్నారు.
ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్‌కి ట్రిపుల్ ప్లాటినం డిస్క్‌లను అందజేయగా, యూనిట్ అంతా కలిసి వెంకటేష్‌కి ప్లాటినం డిస్క్‌ను అందించారు.