Actress Charmi | Mayagadu cinema | Producer | నా కాలు జారిన ఫోటోలు ప్రదర్శిస్తున్నారు: ఛార్మి
ఇదిగో... ఇలా కాలు జారిందట....
మొన్నటివరకూ బాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్లు ఆయా దర్శకనిర్మాతలపై ఫిర్యాదులు చేస్తూ వార్తల్లో నానుతూ ఉండటం మనకు తెలుసు. తాజాగా టాలీవుడ్ కూడా ఈ జాబితాలో చేరేందుకు పోటీపడుతోంది. ఛార్మింగ్ అందాల ఛార్మి, తను నటించిన "మాయగాడు" చిత్ర నిర్మాతపై ఇంతెత్తు లేచి అతనిపై 'మా'లో ఫిర్యాదు చేసింది.షూటింగ్ సమయంలో తను ప్రమాదవశాత్తూ కాలు జారి కిందపడినప్పుడు, ఆ ఫోటోలను దొంగతనంగా తీసి పబ్లిసిటీకి సదరు నిర్మాత ఉపయోగించుకుంటున్నారనీ, అదేమని అడిగితే బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అసలు ఆ చిత్ర నిర్మాత ప్రవర్తన బాగా లేదని ఆరోపించింది.
ఇదిలావుంటే... నటి ఛార్మిపై నిర్మాత యలమంచి రవిచంద్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాడు. తన సినిమా ప్రమోషన్‌కు ఆమె రాకపోవడమే ఇందుకు కారణమని అందులో పేర్కొన్నాడు. ఆమె షూటింగ్‌కు ఆలస్యంగా వచ్చేదనీ, విదేశాల్లో కాల్షీట్లు వేస్టయ్యాయనీ, ఆమెతోపాటు ఎంతమంది వచ్చినా వారికి మర్యాదలు చేసేవారమనీ, అయినా తన సినిమా ప్రమోషన్‌కు రమ్మంటే... షూటింగ్ వరకే తన పనని చెబితే తనలాంటి చిన్న నిర్మాతలకు ఏమిటి దిక్కని ప్రశ్నిస్తున్నారు. దానికి ఛార్మి బదులుగా తనను రవిచంద్ ఏ విధంగా మానసిక క్షోభకు గురిచేసిందీ వివరిస్తూ 6 పేజీల సారాంశాన్ని ముందుకు తెచ్చింది.
ఛార్మి, వేణు కాంబినేషన్లో సాంబశివ క్రియేషన్స్ పతాకంపై యలమంచి రవి మాయగాడు సినిమా ప్రారంభించాడు. సినిమా ప్రారంభించి ఇప్పటికి రెండు సంవత్సరాలైంది. సినిమా పూర్తిగా ఇంకా బయటకు రాలేదు. రవిచంద్ పలువురు వద్ద ఫైనాన్స్ తీసుకుని ఈ సినిమా తీశాడు. కానీ సినిమా కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడం, వేణుకు సరైన బిజినెస్ లేకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. ఈలోగా ఛార్మికి కూడా క్రేజ్ తగ్గిపోతూ వచ్చింది.
మరోవైపు ఫైనాన్స్ వారు రవిచంద్‌పై తీవ్రమైన ఒత్తిడి చేసి ఏదోవిధంగా చిత్రాన్ని రిలీజ్ చేయమని 18వ తేదీన రవిచంద్‌కు సూచించారు. అప్పటినుంచి ఛార్మికోసం ప్రయత్నించకుండా... 24వ తేదీ ఛార్మి తిరుపతిలో ఉండగా.. ప్రెస్‌మీట్ పెడుతున్నాను తనకు ప్రమోషన్ ఇవ్వమని ఫోన్లో అడిగాడు. వచ్చాక చూసుకుందామని తాను చెప్పడం జరిగిందనీ, అంతకంటే తానేమీ మాట్లాడలేదనీ ఛార్మి శుక్రవారంనాడు 'మా' ముందు తెలియజేసింది. కానీ రవిచంద్ తాను షూటింగ్‌లో సహకరించలేదని చెపుతున్నదంతా అబద్ధమని ఛార్మి అంటోంది. తనను షూటింగ్‌లో రవిచంద్ ఏవిధంగా ఇబ్బందులపాలు జేశాడో తెలియజేస్తూ లెటర్ కూడా సమర్పించింది. దీనిపై మా అసోసియేషన్ రేపటికి వాయిదా వేసింది.
రవిచంద్ చెబుతున్నట్లు... తాను విదేశాల్లో ఉండగా, స్వంత కాస్ట్యూమ్స్ వాడుకుని వాటికి డబ్బులు అడగలేదనీ, వారు తెచ్చిన కాస్ట్యూమ్స్ వేసుకున్నానని ఛార్మి అంటోంది. ముందుగా చెప్పినట్లుగా కాకుండా తనను అసభ్యంగా చూపించేందుకు అతి తక్కువ డ్రెస్‌తో షూటింగ్‌లో పాల్గొనాలని ఒత్తిడి చేశాడని ప్రత్యారోపణకు దిగింది. మరి వీరద్దరి ఫిర్యాదులపై మా ఏం చెపుతుందో చూడాలి.
ఇదిలావుండగా... యలమంచి రవిచంద్ గతంలో ఈటీవీలో పనిచేశారు. ఆ తర్వాత శివాజీ హీరోగా రెండు చిత్రాలు నిర్మించాడు. అందులో ఒకటి సీతారాముడు. ఆ చిత్రంలో అంకిత హీరోయిన్. ఆమెను రకరకాలుగా వేధించాడని అప్పట్లో విమర్శలు వచ్చాయి. దాన్ని శివాజీ ఏదోవిధంగా సరిదిద్దాడు. రవిచంద్ నటుడు చలపతిరావుకి స్వయానా మేనల్లుడు. ఇదిలావుండగా... సున్నితమైన అంశాన్ని అనవసరంగా రాద్దాంతం చేశాడని సినీ పెద్ద ఒకరు రవిచంద్‌కు చురక వేసినట్లు తెలిసింది.
