నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరో విభిన్న పాత్రలో ప్రేక్షకులను రంజింప చేయడానికి సిద్ధమవుతున్నారు. లక్కీ మీడియా సంస్థ నిర్మిస్తోన్న బ్రహ్మలోకం టు యమలోకం( వయా భూలోకం)లో ఆయన బ్రహ్మదేవునిగా నటిస్తున్నారు.
ఈ చిత్రం ద్వారా రచయిత గోళ్లపాటి నాగేశ్వరరావు దర్శకునిగా పరిచయమవుతున్నారు. యుతోపియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో బెక్కెం వేణుగోపాల్, రూపేష్.డి. గోహిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, శివాజి, సోనియా, ఆర్తి అగర్వాల్, కల్యాణి ఇందులో ముఖ్య తారలు.
నిర్మాతలు మాట్లాడుతూ... వినోదమే ప్రధానంగా రూపొందుతోన్న సోషియో ఫాంటసీ చిత్రమిది. ఇందులో బ్రహ్మదేవునిగా రాజేంద్రప్రసాద్ అభినయిస్తున్నారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ వంటి మహానుభావులు అనేక రకాల పౌరాణిక పాత్రలు పోషించారు. పౌరాణిక పాత్ర పోషణలో వారి తర్వాతే ఎవరినైనా చెప్పుకోవాలి. వారిద్దరూ చేయని పాత్ర బ్రహ్మదేవుడు. వారిద్దరూ కేవలం రాజేంద్రప్రసాద్ కోసమే ఈ పాత్ర చేయకుండా వదిలేసినట్లున్నారు.
తొలి రోజు ఈ పాత్రలో ఆయనను చూసి ఒక తన్మయావస్థకు గురయ్యాం. ఈ పాత్రను ఇంతకన్నా బాగా ఎవరూ చేయలేరన్నంత స్థాయిలో అభినయం చేశారు. బ్రహ్మదేవునికి నాలుగు తలలు ఉంటాయి. సాధారణంగా అన్ని సినిమాల్లోనూ మిగతా మూడు తలలను ఆర్టిఫిషయల్‌గా చూపించారు. మేం మాత్రం నాలుగు తలలు లైవ్‌గా ఉన్నట్లు చిత్రీకరిస్తున్నాం.
గత నాలుగు నెలలుగా ఇందుకు సంబంధించిన గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ... సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. సినిమా చాలా రిచ్‌గా వస్తోంది. రాజేంద్రప్రసాద్ బ్రహ్మ పాత్ర నభూతో నభవిష్యతిలా రూపొందింది అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ, కెమేరా: వాసు, ఎడిటింగ్: నాగిరెడ్డి, పాటలు: భాస్కరభట్ల రవికుమార్, సహనిర్మాతలు: కొండ్రు శ్రీనివాస్, కొండవీటి రాజా, నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్ ( గోపి), రూపేష్ డి. గోహిల్, కథ- స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: గోళ్లపాటి నాగేశ్వరరావు.