1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. CM Rosaiah

Piracy | CM Rosaiah | Tollywood | MAA | నేను చేస్తానని చెప్పాగా.. బంద్ ఎందుకు..?: రోశయ్య

పైరసీ
పైరసీ జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని చెప్పినప్పటికీ సినీ పరిశ్రమ శుక్రవారం బంద్‌కు పిలుపునివ్వడంపై ముఖ్యమంత్రి రోశయ్య "మా"పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పైరసీకి పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టంగా చెప్పినప్పటికీ బంద్‌లు, నిరాహార దీక్షలు చేయడం దేనికని నేరుగా "మా" సభ్యులకే ఫోన్ చేసి అడిగినట్లు విశ్వసనీయ సమాచారం.

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, సినీనటి జయసుధ సినీ నిర్మాతలకు పైరసీ ద్వారా జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడే పైరసీ చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చామని ముఖ్యమంత్రి రోశయ్య వారితో చెప్పినట్లు తెలిసింది. ఇంత స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ చిత్ర పరిశ్రమ ఇలా స్పందించడం ఏం బాగా లేదనీ, కనుక వెంటనే బంద్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచించినట్లు సమాచారం.

ఈ నేపధ్యంలో ఫిలిం ఛాంబర్లో "మా" అత్యవసరంగా సమావేశమై శుక్రవారం బంద్ విషయంపై చర్చ చేపట్టింది. ముఖ్యమంత్రి సూచనల మేరకు బంద్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటుందో... లేదంటే స్పష్టమైన హామీ అంటూ రోడ్డెక్కుతుందో చూడాలి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT