Betting Bangarraju | Audio | Allari Naresh | Sathi Babu | "బెట్టింగ్ బంగార్రాజు" ఆడియో విడుదల
"బెట్టింగ్ బంగార్రాజు" అనే పేరు వినగానే ఇది పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమని అర్థమవుతుంది. సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వినోద భరిత చిత్రాలకు కేర్ఆఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న హీరో నరేష్ ఈ చిత్రకథానాయకుడైతే, నాయిక ఇందులో అతనితో జోడీ కడుతోంది.
వినోదాత్మక చిత్రాలను రూపొందించడంలో ప్రత్యేకతను కనబరిచే దర్శకుడు ఇ. సత్తిబాబు మరోసారి ప్రేక్షకుల ప్రశంసలందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో మయూరి కంపెనీ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. ప్రముఖ గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, అనంతశ్రీరామ్‌లు ఇందులోని గీతాలను రచించారు.
బెట్టింగ్ బంగార్రాజు ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ఉషాకిరణ్ మూవీస్ రూపొందించిన "నచ్చావులే" చిత్రానికి సంగీతం సమకూర్చిన శేఖర్ చంద్ర ఈ "బెట్టింగ్ బంగార్రాజు"కు స్వరకల్పన చేశారు. సంగీత ప్రియులను ఈ సినిమా మ్యూజిక్ నిస్సందేహంగా ఆకట్టుకుంటుందని చెప్పారు. ఇందులో తాను రాసింది ఒక్క గీతమైనా అందరికీ గుర్తిండి పోతుందని అన్నారు.
కోట శ్రీనివాసరావు, చలపతిరావు, గిరిబాబు, జయప్రకాష్ రెడ్డి ఎల్.బి. శ్రీరాం, కృష్ణభగవాన్, రఘుబాబు, దువ్వాసి మోహన్, అమిత్ పిళ్ళా ప్రసాద్, మేల్కొటి, సన, ప్రగతి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి ఎడిటర్: గౌతం రాజు, నృత్యాలు: శంకర్, సుచిత్ర, ఆర్ట్: నాగేంద్ర, ఫైట్స్: విజయ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ. సత్తిబాబు, నిర్మాత: రామోజీరావు.
