Mani Ratnam | Raavana | Aishwarya Rai | Vikram | ఐష్‌కి 25 అడుగుల దూరంలో బాంబు పేల్చిన మణిరత్నం
రిస్కీ షాట్లతో నిజ జీవితానికి దగ్గరగా సినిమాలను తెరకెక్కించడంలో తమిళ దర్శకుడు మణిరత్నం మహాదిట్ట. ఆయన రూపొందిస్తున్న తాజాచిత్రం "రావణ"కోసం ఓ భయంకరమైన రిస్కీ షాట్ చిత్రీకరించాలని సంకల్పించారు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్, నెంబర్‌వన్ తమిళ స్టార్ విక్రమ్ ఇద్దరు నటిస్తుండగా వారికి సుమారు 25 అడుగులు దూరంలో గాలిలో బాంబు పేలుతున్నట్లుగా సన్నివేశాన్ని తెరకెక్కించాలని స్టంట్ మాస్టర్ కౌశల్‌కు సూచించారు.
మరుసటి రోజు యూనిట్ సభ్యులు అందరిలో ఒకటే టెన్షన్. విక్రమ్, ఐశ్వర్యారాయ్‌లిద్దరితోపాటు మరికొంతమంది నటీనటులు బాంబు పేలుడు సన్నివేశంలో నటించేందుకు సిద్ధంగా ఉన్నారు. స్టంట్ మాస్టర్ కౌశల్ ఐష్- విక్రమ్‌లపైకి బాంబు విసిరాడు. అది ఖచ్చితంగా వారిద్దరికీ 25 అడుగులు దూరంలో గాలిలో పేలిపోయింది. అతను విసరడంలో ఏమాత్రం తేడా ఉన్నా ఐష్- విక్రమ్‌లిద్దరికీ తీవ్రంగా గాయాలు కావడం ఖాయం.
ఈ బాంబు పేలుడు సన్నివేశం ముగిసిన తర్వాత అందరూ గట్టిగా ఓసారి ఊపిరి పీల్చుకుని దర్శకుడు మణిరత్నం వద్దకు చేరారు. ఈ సన్నివేశాన్ని ఇలాగే చిత్రీకరించాలని ఎందుకు అనుకున్నారు... అని ఆయనను ప్రశ్నించారు. దానికి రత్నం సమాధానమిస్తూ తనకు నిజ జీవితంలో ఇటువంటి సంఘటనలు రెండుసార్లు ఎదురయ్యాయనీ, తృటిలో గాలిలో పేలిన బాంబుల నుంచి తప్పించుకుని బతికి బయటపడ్డానని కూల్‌గా చెప్పారట.
