1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Balakrishna

Simha | Balakrishna | Namita | Nayanatara | Sneha Ullal | Chandra Babu | Dasari | బాలయ్య "సింహా" రికార్డులను తిరగరాస్తుంది: చంద్రబాబు

సింహా
WD
నందమూరి బాలకృష్ణ హీరోగా నమిత, నయనతార, స్నేహ ఉల్లాల్ హీరోయిన్లుగా నటించిన "సింహా" ఆడియో సక్సెస్ సభ శనివారం రాత్రి మాదాపూర్‌లోని రాక్‌గార్డెన్స్‌లో జరిగింది. నందమూరి అభిమానుల కేరింతల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి నందమూరి వంశీయులతో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, డాక్టర్. దాసరినారాయణరావు విశిష్ట అతిథిగా విచ్చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియో అమ్మకాలు జోరుగా సాగాయని అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చిత్ర నిర్మాత పరుచూరి కిరీటి తెలియజేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అభిమానుల ఉత్సాహం చూస్తుంటే సినిమా పాత రికార్డులను తిరగరాసేట్లు కన్పిస్తోంది. ఇందులో భాగంగా.. కేసెట్ విజయోత్సవసభ జరగడం విశేషం. ఇదేవిధంగా సినిమాను కూడా ఫ్యాన్స్ హిట్ చేస్తారని నమ్మకం కలుగుతోంది. ఈ సినిమా ఎన్టీఆర్ నటించిన కొండవీటి సింహం అంత హిట్ కావాలని కోరుకుంటున్నాను. గతంలో బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు, సమరసింహారెడ్డి సినిమాలు హిట్ అయ్యాయి. చక్రి హిట్ పాటలను ఇచ్చాడు. అదుర్స్‌లాగే సింహ విజయాన్ని సాధించాలి" అని అన్నారు.

దాసరి మాట్లాడుతూ.. ఈ వేడుక చూస్తుంటే వంద రోజుల ఉత్సవ వాతావరణం కనిపిస్తోంది, దీన్ని పెద్దాయన (ఎన్టీఆర్) పై నుంచి చూస్తునే ఉంటారు. ఇందులోని ఆరు పాటలకు చక్రి ఆరు అరుదైన ట్యూన్స్ ఇచ్చాడు. సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి విడుదలైనప్పుడు అభిమానులు థియేటర్‌కు డప్పులు తీసుకుని డాన్స్ చేశారు. మళ్ళీ ఈ సినిమాకు అలా చేస్తారనిపిస్తోంది. బాలయ్య అభిమానులేకాక చిత్ర పరిశ్రమకు కూడా విజయం అవసరం. దర్శకుడు బోయపాటి మంచి స్టామినా ఉన్న దర్శకుడు" అని చెప్పారు.

కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. "మా వంశానికి ఒక సెంటిమెంట్ ఉంది. తాతగారి కొండవీటి సింహం. బాబాయ్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు బొబ్బిలిసింహం, లక్ష్మీనరసింహా. అలాగే తమ్ముడు సింహా సింహాద్రి ఇలా సింహం పేరు మీద వచ్చిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఈ నెల 30న సినిమా చూశాక మళ్లీ మాట్లాడుతాను" అన్నారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. బాలయ్య సినిమాలు వస్తుందంటే అన్ని సినిమాలు పక్కకు తప్పుకోవాల్సిందే. ఈ సినిమా రికార్డులు కొట్టడం ఖాయం. ఈ సినిమా తీసిన నిర్మాతకు రావాల్సినంత ఖచ్చితంగా రావాలంటే పైరసీ సీడీలు చూడటం మానివేయాలి. నందమూరి వంశం గర్వపడే విధంగా చక్రి సంగీతం సమకూర్చారు" అని తెలిపారు.

బాలకృష్ణ మాట్లాడుతూ.. పుణ్య దంపతుల కడుపున పుట్టడం జన్మ సుకృతం. నాన్నగారే నా గురువు. సింహగా రెండు అక్షరాల పేరుతో వస్తున్న ఈ సినిమా గుండెల్లో చెరగని ముద్రవేసి రికార్డులు వేటాడుతుంది. కథ చెప్పినప్పుడే రెండు పాత్రల్లో వైవిధ్యమే కాకుండా మంచి సందేశం ఉంది. దర్శకుడు దమ్మున్నవాడు. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుంది" అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత, నటీనటులు తదితరులు పాల్గొన్నారు.