1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Siddarth

Manchu Lakshmi | Siddarth | Sruti Hassan | Walt Disney | K.Raghavendra Rao | మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి "రాక్షసి"

మంచు లక్ష్మి
ది వాల్ట్ డిస్నీ కంపెనీ ( ఇండియా) తన మొదటి దక్షిణ భారత చలనచిత్రాన్ని కె.రాఘవేంద్రరావుతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రాజెక్టును నవంబరు 2009లో ప్రారంభించి, జనవరి 2011న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యపాత్రలో సిద్ధార్థ్, శృతిహాసన్, లక్ష్మి మంచు, హర్షిత నటిస్తున్నారు.

సిద్ధార్థ్ తన లవర్ బాయ్ ఇమేజ్‌కు భిన్నంగా కత్తి యుద్ధాలతో పోరాట యోధునిగా ఒక కొత్త పాత్రలో కనబడబోతున్నారు. కథానాయకిగా కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. బుల్లితెర వ్యాఖ్యాతగా అనతికాలంలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించిన డాక్టర్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఒక విభిన్నమైన పాత్రలో నటించనున్నారు. ఇతర ముఖ్యపాత్రలలో డాక్టర్ బ్రహ్మానందం, రవిబాబు, అలీ కనిపించనున్నారు.

వెండితెరపై చిత్రీకరణ బాధ్యత ప్రముఖ ఛాయాగ్రహకుడు సౌందర్ రాజన్‌కు అప్పగించగా ఈ చిత్రానికి ముఖ్యమైన పోరాటాలను మలేషియా ఫైట్ మాస్టర్ విలియం ఒంగ్ డిజైన్ చేశారు. ఫాంటసి చిత్రానికి ఆయువుపట్టు అయిన సెట్స్‌కి, కళాదర్శకుడు భూపేష్ ఆర్. భూపతి కాగా, కాన్సెప్ట్ ఆర్టిస్ట్‌గా రాజీవ్ గొలే వారికి సహకరించనున్నారు.

ఇప్పటికే భీమిలి - విశాఖ, రామోజీ ఫిలింసిటీలలో జరిగే షెడ్యూల్స్‌లో విశాలమైన భారీ సెట్స్ నిర్మించి షూటింగ్ చేశారు. ఫాంటసీ ఫిల్మ్‌కి తగ్గట్లుగా కాస్ట్యూమ్స్‌కు నిఖార్ ధావన్ మరియు భక్తిరెడ్డి డిజైన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి నిర్మాత దేవినేని ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్‌గా చక్రవర్తి రామచంద్ర వ్యవహరిస్తున్నారు. హాలీవుడ్‌ను మరిపించే స్థాయిలో ఫైర్ ఫ్లై వారి గ్రాఫిక్ వర్క్స్ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలువనుంది.

వాల్ట్ డిస్నీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్ సామత్ మాట్లాడుతూ... ఎంతో హై కేలిబర్ ఉన్న ఫిల్మ్ కాస్ట్, హెవీ టాలెంట్ ఉన్న ఫిల్మ్ టీమ్‌తో పనిచేయడం తనకు చాలా ఆనందంగా ఉందని, ఇండియాలో డిస్నీని ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ బ్రాండ్‌గా చూడటం కోసం ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఉండే ప్రాంతీయ కథలను ఎంచుకుని, ఇక్కడ పిల్లలకు పెద్దలకు అందించడానికి ప్రయత్నిస్తామన్నారు. అమెరికా తరువాత డిస్నీ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టిందని, ఇది ఇలాగే కొనసాగుతుందని అన్నారు.

మనిషికి అతని నమ్మకానికి మధ్య ఎప్పటికీ చెరగపోని ఒక అవినాభావ సంబంధాన్ని స్పృశిస్తూ, అంగరాజ్యంలో ఒక కన్నీటి బొట్టు ఆకారంలో ఉండే కాల్పనిక గ్రామలో కథ నడుస్తుంది. క్షుద్ర శక్తులతో అంగరాజ్యాన్ని నాశనం చేయాలనుకునే ఒక రాక్షస మహారాణి( మంచు లక్ష్మి) బారి నుంచి దైవశక్తులు గల తొమ్మిదేళ్ల పాప( హర్షిత)ను కాపాడడానికి ఒక మహావీరుడి( సిద్ధార్థ్)కి, ఆ రాక్షస మహారాణికి మధ్య జరిగే సంఘర్షణ ఈ చిత్ర సారాంశం. శృతిహాసన్ ఆ వీరునికి ప్రేమికురాలుగా, ఒక జిప్సి వనిత పాత్రను పోషిస్తున్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT