1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Tollywood

Dasari Narayana Rao | Tollywood | Directors | Producers | దర్శకరత్న అయితే ఎవడికేంటి..?!!

దాసరి నారాయణరావు
WD
ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు కావడం తెలిసిందే. ఇండస్ట్రీకి తానే పెద్ద దిక్కుగా భావిస్తూ పలు రకాలుగా అన్ని సమస్యల్లో వేలు పెడుతున్న దర్శకరత్నకు పరాభవం జరిగింది. ఒకప్పుడు ఎన్టీఆర్‌తో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయనను దర్శనం చేసుకునేందుకు చెన్నైలో ప్రముఖ నిర్మాతలంతా పడిగాపులు కాసేవారు. కార్లు లైన్లో క్యూ కట్టి నిలబడి ఉండేవి.

అంతటి ప్రభను చూపించిన ఆయన ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి ఇండస్ట్రీకి దూరమయ్యారు. మళ్లీ పదవి పోయాక ఇండస్ట్రీకి తిరిగి వచ్చి తానే ఇండస్ట్రీకి పెద్ద దిక్కని ప్రచారం చేసుకున్నారు. తిరిగి వచ్చిన తర్వాత తొలిసారిగా "ఫూల్స్" అనే సినిమా తీసి "ఫూల్" అయ్యారు. ఆయన దర్శకత్వానికి పసపోయిందనేది ఆయన అసిస్టింట్లే అంటుంటారు. ఇంకో విషయం ఏంటంటే.. ఆయన చిత్రాల్లో ఆయన శిష్యులే ఎక్కువగా పనిచేస్తారు.

ప్రస్తుతం ఆయన వైఎస్ ఆశయాలను భుజాలపై వేసుకుని "యంగ్ ఇండియా" అనే సినిమాను నిర్మించారు. ఇదిలావుంటే.. ఇటీవలే డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో తమ్మారెడ్డి భరద్వాజ దాసరి ప్యానల్ తరపున నిలబడ్డారు. ఆల్రెడీ ఆయనపై పలు ఆరోపణలున్నాయి. అయినా యువదర్శకులంతా మరో ప్యానల్‌లో పోటీ చేశారు. వారి తరపున సాగర్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసి ఎన్నికయ్యారు. రెండు వర్గాలుగా చీలిన ఇండస్ట్రీలో తమ్మారెడ్డి ఓడిపోవడంతో దాసరి ఖంగుతిన్నారు.

ఇదిలావుంటే... మొన్ననే డైరెక్టర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గౌరవాధ్యక్షులుగా దాసరి పేరును పెట్టాలని దాసరి శిష్యవర్గం సూచించింది. జనరల్ బాడీ పూర్తయ్యాక గెలిచిన వర్గమంతా ముక్తకంఠంతో దాసరి పేరును పెట్టేందుకు ససేమిరా అంది. దీంతో ఖంగుతినడం దాసరి వంతయింది. ఎటువంటి సమస్య వచ్చినా దాసరి దృష్టికి తేవడం... దాన్ని ఆయన సాగదీసి... చివర్లో ఆయనే సమస్యపై పోరాడుతున్నట్లు నాటకమాడటం వంటివి యూత్ దర్శకులకు తెలిసి దాసరిని దూరంగా పెట్టారని విశ్వసనీయ సమాచారం.

మరోవైపు... దాసరి తన ప్రాభవాన్ని కాపాడుకోవడానికి ఇరు వర్గాల మధ్య ప్లే ఆడుతున్నట్లు సమాచారం. ఇంత జరిగాక ఆయన శిష్యుడైన ఒకనాటి పత్రిక సంపాదకుడు... తీవ్రమైన ఆవేశంతో... గురువుగారి పేరును తిరస్కరిస్తారా...? నా ఒళ్లు మండిపోతుందంటూ... ఫుల్‌గా మందు తాగి నానా బీభత్సం సృష్టించాడట.

ఇదిలావుండగా... చిన్న నిర్మాతలు, దర్శకులంతా కలిసి ఇండస్ట్రీలో ముగ్గురు పెద్దలు థియేటర్లను కబ్జా చేస్తున్నారని దాన్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించారు. గతంలో కేంద్రమంత్రిగా ఉన్న దాసరికి కూడా విన్నవించారు. ఇన్నేళ్లుగా పరిష్కరించలేని సమస్యపై దాసరి ఓ ఫంక్షన్లో మాట్లాడుతూ... ముగ్గురు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో మీడియా అంతా ఇదేదో పెద్ద ఇష్యూ అని ఆయన చుట్టూ చేరింది. దీంతో ఆయన మళ్లీ కేంద్ర బిందువయ్యాడు.

తీరా ఆయన చేసింది చూస్తే... ఏమీ లేదు. ఇలా... చిన్న నిర్మాతలు, దర్శకుల సమస్యల్ని తనవైపు తిప్పుకుని పేరు సంపాదించుకునే నైజమని అందుకే దాసరిని దూరంగా పెట్టినట్లు కొందరు భావిస్తున్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT