1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. ఫిలిమ్ ప్రొడక్షన్ బడ్జెట్ కంట్రోల్‌పై నిర్మాతల సమావేశం

Producers, Film Production, Budget, Film Chamber | ఫిలిమ్ ప్రొడక్షన్ బడ్జెట్ కంట్రోల్‌పై నిర్మాతల సమావేశం

నిర్మాతలు
తెలుగు చలనచిత్ర నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతున్న దృష్ట్యా దీనిపై చర్చించేందుకు అత్యవసర సమావేశం మంగళవారంనాడు ఫిలిమ్ ఛాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అన్నపూర్ణా స్టూడియో నుంచి సుప్రియ, ఇంకా డి. సురేష్ బాబు, కె.సి. శేఖర్ బాబు, పోకూరి బాబూరావుతోపాటు పలువురు నిర్మాతలు పాల్గొన్నారు.

ప్రస్తుతం సినీ నిర్మాణవ్యయం పెరిగిపోయి నిర్మాతలకు భారీగా నష్టం వాటిల్లుతున్నందున వ్యయాన్ని తగ్గించుకోవాలని కొందరు సూచించారు. ఈ విషయాన్ని కూలంకషంగా చర్చించడానికి 11మంది సభ్యులతో దాసరి నారాయణరావు అధ్యక్షతన ఒక కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ఈ విషయమై డి. సురేష్ బాబును సంప్రదిస్తే... ఇది రొటీన్ మీటింగ్ అనీ... 11మందితో కమిటీ అనేది పాతదే అనీ, ఇది ఇప్పుడు అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని మీడియాతో చెప్పారు. మరో నిర్మాత మాట్లాడుతూ.. 11మందితోపాటు దిల్ రాజు అధ్యక్షతన కమిటీ సమావేశం జరుగుతుందని వెల్లడించారు.

ఏదిఏమైనా మరో వారం రోజుల్లో వీటిపై చర్చిస్తామని సమావేశాన్ని ముగించినట్లు తెలిసింది. ప్రధానంగా అగ్రహీరోల పారితోషికాలు, షూటింగ్ లొకేషన్లు, ఇతరత్రా ఖర్చులు తగ్గించాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. అందులో ఫలానా హీరో పేరును ప్రస్తావించలేదని ఓ నిర్మాత తెలియజేశారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT