Chalaki | Aditya Babu | Roja | Chiranjeevi | Megastar | పాటల చిత్రీకరణలో ఆదిత్య బాబు "చలాకి"
ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై ఆదిత్య బాబు కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రానికి "చలాకి" అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా మాదేష్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. రోమా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ చిత్రం ఆధారంగా రూపొందుతోంది. లేడీస్ కాలేజీలో ఓ కుర్రాడు ఎలా చేరాడు? దానికి కారణాలేమిటి? అన్న అంశంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
ఈ చిత్రం గురించి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో ఆదిత్యబాబు మాట్లాడుతూ.. "ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. పాటల చిత్రీకరణ జరుగుతోంది. హీరోను పరిచయం చేసే ఈ సాంగ్‌కు ప్రేమ్‌రక్షిత్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.
గతంలో ఆదిత్యబేనర్‌లో రెండు విజయవంతమైన చిత్రాలు నిర్మించాం. మూడవ చిత్రానికి నేనే హీరోగా పరిచయం అవుతున్నాను. మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా 8వ తరగతిలోనే సినిమాల్లోకి రావాలని కోరిక ఉండేది. పెద్దలు ఇంజనీరింగ్ చదివాక చేద్దువుగానీ అన్నారు. అనుకున్నట్లు నా ఇంజనీరింగ్ కూడా అయిపోయింది. కథపరంగా నేను ఇంజనీరింగ్ చదువుతుంటాను. ఈ నెలాఖరులో ఆడియోను వచ్చేనెలలో సినిమాను విడుదల చేస్తాం" అన్నారు.
