Sai Achut Chinnari | Director | Naresh | Pulihora | పాత చింతకాయ పచ్చడి కాదు... కొత్త రుచులు కావాలి: సాయి అచ్యుత్
WD
ఇపుడు ఎక్కువగా కడుపారా నవ్వించే మినీ సీరియళ్లు, ఆసక్తిని రేకిత్తించే గేమ్ షోలంటేనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో బుల్లితెర సీరియల్ డైరక్టర్లు కూడా తమ పంథాను మార్చుకోవలసి వస్తోంది. పాతచింతకాయ పచ్చడి టైపు సీరియళ్లకు వీక్షకులు నో చెప్పేస్తూ టీవీని కట్ చేసి పారేస్తున్నారన్నది సత్యం.
టీవీ ప్రేక్షకులను తమ తెరవైపు ఆకర్షించి మెప్పించే దిశగా కొంతమంది బుల్లితెర దర్శకులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల మా టీవీలో ప్రసారమైన పులిహోర అటువంటిదే. ఆ సీరియల్ వీక్షకులను కడుపారా నవ్వించడంలో సఫలమైంది. సహజంగా టెలివిజన్ సీరియల్ అనగానే దానిపై ఓ ముద్ర పడిపోయి ఉంటుంది.
యాక్షన్ ద్వారా కాకుండా కేవలం డైలాగ్ డెలివరీ ద్వారా నవరసాలను పలికించేయాలని చూస్తుంటారు. కానీ దీనికి భిన్నంగా ఈ పులిహోర హాస్యప్రధాన సీరియల్ వీక్షకుల ముందుకు వచ్చింది. సినిమాటైపులో యాక్షన్‌కు ప్రాధాన్యమిస్తూ పులిహోర సీరియల్ ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంలో ఆ సీరియల్ డైరెక్టర్ సాయి అచ్యుత్ చిన్నారి సఫలమయ్యారు.
నరేష్ ప్రధానపాత్ర పోషించిన ఈ పులిహోర సీరియల్ క్లాస్ రూమ్ బ్యాక్ డ్రాప్‌తో సాగుతుంది. కాలేజీ లైఫ్‌ను ఎంజాయ్ చేయలేకపోయిన వ్యక్తులకోసం లేటు వయసు కాలేజీ ఆనందాన్ని ఆస్వాదించాలన్న ధ్యేయంతో ఓ కళాశాలను ప్రారంభిస్తారు నరేష్. ఇక అక్కడ నుంచి సీరియల్ పూర్తి హాస్యాన్ని జోడిస్తూ ముందుకు వెళుతుంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న తాజా సంఘటనలను ప్రేక్షకుల ముందుకు తెస్తూనే పులిహోర పట్టు సడలకుండా హాస్య గుళికలను సమర్థవంతంగా అందించడంలో దర్శకుడు అచ్యుత్ కృతకృత్యుడయ్యాడనే చెప్పవచ్చు.
సీరియల్ చిత్రీకరణపై ఆయనను కదిలిస్తే... హాస్యాన్ని పండించడం ఎంతో కష్టమని అందరికీ తెలిసిందే. వెండితెరపై ఒకేసారి నాలుగైదు క్యారెక్టర్లను చూపించి నవ్వులను పూయించవచ్చు. అదే.. బుల్లితెరపైకి వచ్చేసరికి ఆ స్కోప్ కాస్త తక్కువగా ఉంటుంది. కానీ బిగ్ స్క్రీన్ స్థాయిలో ప్రతి ఫ్రేమును ఆలోచించి అదే రేంజ్‌లో తీసేందుకు అహర్నిశలు శ్రమించాను. నేను అనుకున్న విధంగా వచ్చేవరకూ సన్నివేశాలకు బాగా పదును పెట్టాను.
నా ఆలోచన, స్క్రిప్ట్ వర్క్‌కు తగ్గట్లుగా నరేష్‌గారూ, ఇతర నటీనటులు చాలా చక్కగా చేశారు. ఆ కృషి ఫలితంగా బుల్లితెరపై ఇటీవల కాలంలో సక్సెస్‌ఫుల్ కామెడీ సీరియల్‌గా పులిహోర పేరు తెచ్చుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంద"న్నారు. ఇంకా కడుపుబ్బా నవ్వించే వేడివేడి పకోడిల్లాంటి హాస్యరస సీరియళ్ల రూపకల్పన చేస్తున్నాననీ, తన ఆలోచనంతా బుల్లితెర సీరియల్ బిగ్ స్క్రీన్ సన్నివేశ చిత్రీకరణకు ఏమాత్రం తక్కువగా ఉండకూడదనేదేనని వెల్లడించారు. త్వరలో ఓ బిగ్ ప్రాజెక్టుతో సినిమా స్క్రీన్‌పైనా సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.