1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Dasari Narayana Rao

Balakrishna | Dasari Narayana Rao | Paramaveerachakra | Simha | దర్శకరత్న - యువరత్న కాంబినేషన్‌లో "పరమవీరచక్ర"

బాలకృష్ణ
WD
"సింహా" హిట్‌తో ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా బాలకృష్ణ కాల్షీట్స్ కోసం ఎగబడుతోంది. ఇలా ఎగబడుతున్నవారిలో పేరుమోసిన దర్శకనిర్మాతలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సంగతి ప్రక్కనపెడితే బుధవారం దర్శకరత్న దాసరి నారాయణరావు బాలయ్యతో సినిమా తీస్తున్నట్లు చెప్పారు. ఆయన పుట్టినరోజు కూడా కావడంతో ఈ కార్యక్రమానికి యువరత్న బాలకృష్ణ కూడా వచ్చారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... గత రెండేళ్లుగా దాసరిగారితో సినిమా చేద్దామని అనుకుంటున్నాననీ, కానీ ఏమిటో అలా కాలం దొర్లుతూ పోయిందని అన్నారు. ఆ తర్వాత దాసరి మాట్లాడుతూ... "బాలయ్య బాబు చెప్పినట్లే రెండేళ్ల నుంచి బాలయ్యతో సినిమా తీయాలను అనుకుంటూనే ఉన్నా. బాలయ్య బాబుకు తగిన స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నా. టైటిల్ 'పరమవీరచక్ర' అని కూడా అనుకున్నాను. కానీ ఎందుకనో సినిమా చేయడానికి కుదర్లేదు. బహుశా నా 150వ చిత్రంగా ఈ సినిమా చేయాలని రాసి ఉన్నట్లుంది. అంతేకాదు మా ఇద్దరి కాంబినేషన్లో తొలిసారిగా తెలుగు ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించాలని అలా వాయిదా పడుతూ వచ్చి ఉంటుంద"న్నారు.

సర్గీయ నందమూరి తారక రామారావుగారితో తను సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి వంటి సన్సేషనల్ హిట్ చిత్రాలను తీశానని గుర్తు చేసుకున్నారు. ఇపుడు మళ్లీ అదే రేంజ్‌లో ఉన్నటువంటి పరమవీరచక్ర క్యారెక్టర్ చేయాలంటే అది ఒక్క బాలయ్య బాబుకే సాధ్యమవుతుందని అన్నారు. ప్రేక్షకులు, బాలయ్య బాబు అభిమానులు తమ ఇద్దరి నుంచి ఏ రేంజ్ చిత్రాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తారో... అంతకు మించిన అంచనాలతోనే తను కథను తయారు చేసుకున్నానని చెప్పారు.

బాలకృష్ణ ఇప్పటివరకూ తన కెరీర్లో ఇటువంటి చిత్రాన్ని చేయలేదని అన్నారు. ఈ చిత్రానికి కల్యాణ్ నిర్మాత కావడం తనకు మరింత బలాన్నిచ్చిందన్నారు. తన బర్త్ డే రోజున సినిమా ప్రారంభించబోతున్నట్లు ప్రకటించిన తను బాలయ్య బాబు పుట్టినరోజు నాడు చిత్రం షూటింగ్ ప్రారంభించి సంక్రాంతి పండగ నాటికి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకవస్తామని దాసరి నారాయణరావు తెలిపారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT