Tammareddy Bharadwaja | NTR | Victory Venkatesh | Mohan Babu | Heroes | Vettori | నా భాష అంతేనండీ బాబూ..!: తమ్మారెడ్డి భరద్వాజ
WD
ఈ నేపథ్యంలో.. హీరోలపై తాను చేసిన వ్యాఖ్యలకు తమ్మారెడ్డి సోమవారం వివరణ ఇచ్చారు. చరిత చిత్ర ఫిలిమ్ ప్రొడక్షన్స్ 42 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా తమ్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. హీరోలపై తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినీ నిందించాలనే ఉద్దేశంతో కాదన్నారు.
ఇంకా తమ్మారెడ్డి మాట్లాడుతూ.. "భాషపై నాకు పరిజ్ఞానం లేదు. నేను పామరుణ్ణి. ఇంట్లో ఎలా మాట్లాడుతానో అలాగే అందరి దగ్గర మాట్లాడుతాను. ఎప్పుడూ ఒకేలా మాట్లాడుతాను. మొత్తానికి నా భాష అంతే..!" అని తేల్చి చెప్పారు.
హీరోలను నిందించడం తన ఉద్దేశం కాదని, తెలుగు సినిమా దుస్థితిని దృష్టిలో పెట్టుకునే హీరోలపై అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందన్నారు. హిందీలో అమీర్ ఖాన్ నటించి హిట్ అయిన "లగాన్" వంటి చిత్రాలు తెలుగులో రాకపోవడానికి కారణాలేమిటి? అని తమ్మారెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. తెలుగు హీరోలు ఎప్పుడూ ఒకే ధోరణిలో ఫైట్స్, పాటలు, నచ్చిన హీరోయిన్‌నే తన సరసన నటించాలని కోరుకుంటున్నారన్నారు.
మంచి సినిమాలు చేసి అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి అగ్రహీరోల రేంజ్‌లో సక్సెస్ కాలేకపోతున్నారని తమ్మారెడ్డి వాపోయారు. ఇంకా తెలుగు సినిమా కథల్లో కొత్తదనం లేదని ఆయన తెలిపారు. మొత్తానికి తెలుగు హీరోలు విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులకు ఆకట్టుకుని, మార్కెట్‌ను పెంచే దిశగా రాణించడం లేదనే ఉద్దేశంతోనే హీరోలపై అలాంటి వ్యాఖ్యలు చేశానని తమ్మారెడ్డి అన్నారు. అంతేగాని.. ఎవరినీ నిందిచాలని అలా మాట్లాడలేదని ఆయన తేల్చిచెప్పారు. ఇంకా తాను చేసిన వ్యాఖ్యలను మీడియానే నెగటివ్‌గా ప్రచారం చేసిందని తమ్మారెడ్డి వెల్లడించారు.
హీరోలపై తాను చేసిన వ్యాఖ్యలకు అగ్రహీరోలు స్పందించారని తమ్మారెడ్డి అన్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ తనకు ఫోన్ చేసి ఇకపై విభిన్న పాత్రలు పోషిస్తానని, "అదుర్స్"లోనూ డిఫరెంట్ పాత్రలో కన్పించానని చెప్పారు. అలాగే విక్టరీ వెంకటేష్ కూడా తన వ్యాఖ్యలకు స్పందించి "ఈనాడు"లో కమల్‌హాసన్‌తో కలిసి వైవిధ్యమైన పాత్ర పోషించానని అన్నారు. ఇదేవిధంగా నిర్మాతలు, దర్శకులు ముందుకు వస్తే మోహన్ బాబు కూడా ఛాలెంజింగ్ పాత్రలు పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు" అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.
ఇంకా తమ్మారెడ్డి మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్ల క్రితం "గజినీ" లాంటి స్క్రిప్ట్‌ను వినిపిస్తే తెలుగు హీరోలు అంగీకరించలేదని అన్నారు. ఆ హీరో పేరు ఎవరనే విషయాన్ని మాత్రం తమ్మారెడ్డి చెప్పకుండా దాటవేశారు. తన తొలి సినిమా "అలజడి" హిట్ కావడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన తెలిపారు. ఇదే పేరుతో తమ బ్యానర్ చరిత చిత్ర ప్రొడక్షన్స్‌పై పది మంది హీరోలతో మెగా సీరియల్ చేస్తున్నానని, ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యిందని తమ్మారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమలో తన కెరీర్‌ను తమ్మారెడ్డి విశ్లేషించుకున్నారు. వందరూపాయలతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టానని, ప్రస్తుతం ఆర్థిక పరంగా ఎదగడంతో పాటు పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నానని తమ్మారెడ్డి తెలియజేశారు.
ఇకపోతే.. హీరోలను "బాబు" అని సంభోదించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు తమ్మారెడ్డి స్పందిస్తూ.. తెలుగు ఇండస్ట్రీలోని అగ్రకథానాయకులతో పాటు అందరినీ "బాబు" అని సంబోధించే సంప్రదాయం ఉంది. బాబు అని ఆత్మీయతకు గుర్తుగా పిలుస్తుంటామన్నారు. ఇంకా చెప్పాలంటే..? హీరోల కంటే ముందే తాను "బాబు" అని పిలుపించుకున్నానని, తన తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన కాలంలో మా అన్నదమ్ములను చిన్నబాబు, పెద్దబాబు అని సంబోధించేవారని ఆయన అన్నారు. ఇదేవిధంగా ఇండస్ట్రీలోని అందరూ తనను బాబు అని పిలిచే వారని తమ్మారెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ప్రముఖ గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి మరణంపై తమ్మారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. గొప్ప గేయరచయితగా తెలుగు చిత్ర సీమను శాసించిన వేటూరికి రాష్ట్రప్రభుత్వం ప్రకటించే నంది అవార్డుల్లో ఉత్తమ గేయ రచయిత వేటూరి పేరుతో అవార్డులను అందజేయాలని తమ్మారెడ్డి డిమాండ్ చేశారు. వేటూరి పేరుతో నంది అవార్డును ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ సోమవారం మెమోరాండమ్‌ను సమర్పించనున్నట్లు తమ్మారెడ్డి వెల్లడించారు. ఇండస్ట్రీలో మనిషి బతికివున్నప్పుడే గౌరవ మర్యాదలు ఉండాలని తమ్మారెడ్డి అన్నారు.