Jayaprada | Jayapradam TV Show | Ram Charan | NTR | రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన నటిస్తా: జయప్రద
WD
జయప్రద మాట్లాడుతూ... ఈ రోజుతో నా జీవితంలో కొత్త అధ్యాయం, కొత్త మలుపు ప్రారంభమైంది. రాజమండ్రి నుంచి రాంపూర్ వరకూ సాగిన నా ప్రయాణంలో ఇప్పటివరకూ ఎనిమిది భాషలలో 300 పైగా చిత్రాల్లో నటించాను. ఆంధ్ర నుంచి కొంత దూరమై బాలీవుడ్‌కు ప్రమోట్ అయిన నాకు తెలుగు చిత్రాలంటే ఇప్పటికీ ప్రత్యేకమైన అభిమానం ఉంది.
తెలుగు పరిశ్రమ నాకు పాఠశాల వంటిది. ఇక్కడే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను ఒక నదిలాంటి దానిని. ఎక్కడికెళ్లినా నాకంటూ ఒక దారిని సృష్టించుకోగలను. ఒక ఆర్టిస్టుకి హద్దులుండవు. అలాంటిదే ఈ కార్యక్రమం. తల్లి, అక్క, ఆంటీ తరహా పాత్రలు చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. నిజానికి నా కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడే తల్లి, అమ్మమ్మ ఛాయలున్న పాత్రను సాగరసంగమంలో చేశాను.
ఇప్పుడు సాగరసంగమంలాటి పాత్రను విశ్వనాథ్ క్రియేట్ చేస్తే తప్పకుండా ఆ పాత్రలో నటిస్తాను. అలాగే భవిష్యత్‌లో నాకోసమే ఏదైనా పాత్రను సృష్టించే రోజులు వచ్చినా ఆశ్చర్యపోను. సినిమాలైనా సరే, రాజకీయాలైనా సరే లేదంటే బుల్లితెరైనా సరే.. అందరికీ చేరువ కావాలన్న తపనతోనే చేస్తాను. నేను డైరెక్టర్ ఆర్టిస్ట్‌ను. డైరెక్టర్ ఏది చెపితే అదే చేయాలనుకుంటాను. బుల్లితెరపైనా ఇదే వర్తిస్తుంది.
లోకల్ ఛానల్ ప్రారంభోత్సవంనాడు హాజరయ్యాను. ఇప్పుడు అదే ఛానల్‌లో ఈ కార్యక్రమం చేయడం ఆనందంగా ఉంది. ఆనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశీస్సులతో ఈ ఛానల్ దినదినప్రవర్థమానంగా ఎదుగుతుందని భావిస్తున్నాను. అతి తక్కువ సమయంలో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఛానల్ ముందుకు దూసుకుపోయేలా ప్లానింగ్ జరుపుతున్న స్వప్నకే ఈ క్రెడిట్ దక్కుతుంది.
అశ్వనీదత్‌గారు నాకు మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. నన్ను ప్రేమించి అభిమానించేవారికోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకు తార్కాణమే ఈ కార్యక్రమాన్ని అంగీకరించడం. ఒక స్థాయికి వెళ్లాక డబ్బుకోసం పనిచేయాలని అనిపించదు. అభిమానం, స్నేహంకోసం చేయాలనిపిస్తుంది.
డైరెక్టర్లు ఎలా చేయమంటే అలా అడాప్ట్ అయిపోగలగడం నాకు ప్లస్ పాయింట్. కథకు కీలకమైన పాత్రల్లోనూ నటించడానికి సిద్ధమే. అవకాశం వస్తే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో నాయికగా నటించడానికి సిద్ధమే( నవ్వుతూ). బుధ, గురువారాలలో ప్రసారం అయ్యే కార్యక్రమాన్ని తప్పకుండా చూడండి అన్నారు జయప్రద.