Balayya | Simran | Pranita | Paruchuri Murali | Simha | Parama Veera Chakra | బాలయ్య- సిమ్రాన్- ప్రణీత- కాంబినేషన్‌లో కొత్త చిత్రం!
WD
తాజాగా, పరుచూరి మురళి దర్శకత్వంలో నటించే కొత్త చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని డాక్టర్ రామానాయుడు స్టూడియోలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ చిత్రంలో బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇందులో ఒకరు సిమ్రాన్ కాగా, మిగిలిన ఇద్దరు ప్రణీత, స్నేహా ఉల్లాల్‌లను ఎంపిక చేసినట్టు సమాచారం.
గతంలో నమిత, నయనతార, స్నేహా ఉల్లాల్‌లతో బాలయ్య నటించిన సింహా చిత్రం సెన్సేషనల్ హిట్ కావడంతో, అదే సెంటిమెంట్‌తో ఇంకా టైటిల్ ఖరారు కాని కొత్త చిత్రంలో ఉంటుంది. ముగ్గురు భామలతో ఆడిపాడటం బాలకృష్ణకు కలిసొచ్చే సూపర్ సెంటిమెంట్ అని సినీ పండితులు కూడా జోస్యం చెబుతున్నారు.
కాగా, బాలయ్య, సిమ్రాన్, ప్రణీత కాంబినేషన్‌లో వచ్చే కొత్త చిత్రం పూజా కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు వంటి అతిరథ మహారధులు హాజరయ్యారు. బాలయ్యపై తీసిన ముహూర్తపు షాట్‌కు చంద్రబాబు నాయుడు క్లాప్ కొట్టారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఇప్పటికే దాసరి నారాయణరావు దర్శకత్వంలో బాలయ్య బాబు నటిస్తున్న పరమవీరచక్ర 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదేవిధంగా పరుచూరి మురళీ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న కొత్త చిత్రం కూడా క్రేజీ ప్రాజెక్టు అవుతుందని తెలుస్తోంది.
పెదబాబు, ఆంధ్రుడు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన పరుచూరి మురళీ బాలయ్యను విభిన్న గెటప్‌తో ప్రేక్షకులకు చూపించనున్నారు.