1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Nagarjuna

Ramgopal Varma, Katha screenplay direction appalraju | Nagarjuna | Sridevi | Sunil | శ్రీదేవిని చూడ్డానికి లైన్‌లో నుంచొని టిక్కెట్లు కొన్నా: వర్మ

కథ
WD
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా తెరకెక్కే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు సినిమా ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. శుక్రవారం జరిగిన ఈ ప్రారంభోత్సవంలో అతిలోక సుందరి శ్రీదేవి సహా ఆమె భర్త బోనీకపూర్, అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావు, బి.గోపాల్, గుణశేఖర్, శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను, నాగచైతన్య, రాణా, నితిన్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

ముహూర్తపు షాట్‌ను దర్శకుడు రామూ తనదైన శైలిలో విభిన్నంగా చిత్రీకరించారు. రొటీన్ పద్ధతిలో ఉండే కెమేరా స్విచాన్, గౌరవ దర్శకత్వం వంటివి లేకుండా తన సినీ కేరీర్‌కు క్లాప్‌నిచ్చిన హీరో నాగార్జున, అసలు తను సినిమారంగంలోకి రావడానికి ప్రేరణనిచ్చిన శ్రీదేవి.. ఇద్దరూ క్లాప్‌నిస్తుండగా తొలి సన్నివేశాన్ని కథానాయకుడు సునీల్‌పై చిత్రీకరించారు.

అనంతరం వర్మ మాట్లాడుతూ... 12 సంవత్సరాల తర్వాత తెలుగులో నేరుగా చేస్తున్న చిత్రమిది. నాగార్జున, శ్రీదేవి ఇద్దరినీ ఇక్కడికి అతిథులుగా పిలువడం వెనుక ఫ్లాష్ బ్యాక్ ఉంది. నాగ్ నా సినీ కెరీర్‌కే క్లాప్ నిచ్చారు. కేవలం శ్రీదేవిని చూడటానికి నేను లైన్‌లో నుంచొని టిక్కెట్లు తీసిన రోజులున్నాయి. అసలు నేనీ రంగాన్ని ఎంచుకోవడానికి కారణమే ఆమె. అందుకే ఈరోజు ఇలా కలిశాం.

సినిమా కథ విషయానికి వస్తే... నా వ్యక్తిగత జీవితాన్నే తెరకెక్కిస్తున్నాను. హాస్యాన్ని మేళవించి తీస్తున్నా. దర్శకుడు కావాలనుకున్న వ్యక్తి అప్పటికే ఈ రంగంలో ఉన్న దర్శకుల విషయంలో ఏం ఆలోచిస్తాడో.. అసలు దర్శకుడెలా ఉంటాడో వ్యంగ్యంగా చూపిస్తున్నా. అందుకు అవసరమైన నేపథ్యంతో ఓ పాటను కూడా సృష్టించాం. అందులో నాతో సహా అందరి దర్శకులపైనా విమర్శలు, చెణుకులు ఉన్నాయన్నారు.

ముఖ్య అతిథి శ్రీదేవి మాట్లాడుతూ... చాలాకాలం తర్వాత మనవాళ్లని కలుసుకొనే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇలా రావడానికి రామూయే కారణం. నాగ్‌తో ఆఖరి పోరాటం అనుభవాలు మర్చిపోలేనివి. ఆయన మంచి వ్యక్తి. అందరితో సరదాగా ఉంటారు. ఇప్పుడు గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. సిల్వర్ జూబ్లీ వేడుకకు మళ్లీ నేను, నా భర్త కలిసి హాజరవ్వాలి" అన్నారు.

నాగార్జున మాట్లాడుతూ... రామూ వస్తే కొత్త టెక్నీషియన్లకు పని దొరుకుతుంది. ఆయన తీస్తున్న రక్తచరిత్ర పాటలు, ట్రైలర్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆ సినిమాకోసం ఎదురు చూస్తున్నా. అలాగే సునీల్ హీరోగా రూపొందిస్తున్న ఈ చిత్రం కూడా విజయం సాధించాలి అన్నారు. బోనీకపూర్ మాట్లాడుతూ... వర్మ చిత్రీకరణ శైలి విభిన్నమైనది. చాలా బావుంటుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సునీల్‌కి అంతా మంచే జరగాలి. అలాగే నాగార్జున మంచి మిత్రుడు" అన్నారు.

సునీల్ మాట్లాడుతూ... ఊహించనివన్నీ జరుగుతున్నాయి. వర్మ ప్రేమకథ సినిమాలో నటించాలని ప్రయత్నించా. పోటీ ఎక్కువగా ఉండటం వల్ల ఎంపిక అవలేదు. అప్పుడు మిస్సవడం వల్లే ఈరోజు ఈ చిత్రంలో ఇలా అవకాశమొచ్చిందేమో.! శ్రీదేవికి నేను వీరాభిమానిని" అన్నారు.

స్వాతి, బ్రహ్మానందం, అలీ, తనికెళ్ల భరణి, ఎంఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణు మాధవ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: వై. సుధాకర్ రెడ్డి, ఆర్ట్: ఆర్.కృష్ణ, ఎడిటర్: భానోదయ, సంగీతం: కోటి, సమర్పణ: వందిత కోనేరు, బ్యానర్: శ్రేయా ప్రొడక్షన్స్, నిర్మాత: కిరణ్ కుమార్ కోనేరు.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి