MS Reddy | Mallemala | Idee na katha | NTR | Chiranjeevi | Jayalalitha | నాటి-నేటి తారలను ఉతికేసిన మల్లెమాల "ఇదీ నా కథ"
WD
టాలీవుడ్ సినీతారలు ఆ పుస్తకం పేరు చెబితే ఎందుకని అంతగా భయపడిపోతున్నారు..? అని చూస్తే బోలెడన్ని అంశాలున్నాయని తెలుస్తోంది. మల్లెమాల అలియాస్ ఎంఎస్ రెడ్డి సహజ కవిగానే కాదు సక్సెస్‌ఫుల్ నిర్మాత కూడా. ఆయన ఇటీవల ఇదీ నా కథ పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. పుస్తకం చదివినవారు అరే ఇలా జరిగిందా..? అని ముక్కున వేలేసుకున్నట్లుగా అందులో సంఘటనలున్నాయి.
ఒకరేంటి ఆనాటి నందమూరి తారక రామారావు నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకూ అందరినీ తన పుస్తకంలో ఏకి పారేశారు మల్లెమాల. ఇదీ నా కథ పేర ఆయన తన అనుభవాలను పుస్తక రూపంలో తెచ్చారు. సినీ ప్రముఖులతో తన అనుభవాలను ఈ పుస్తకంలో జోడించారు.
ముఖ్యంగా తెలుగుతెర "రాముడి"గా కొలిచే సీనియర్ ఎన్టీఆర్ గురించి చాలా విషయాలే చర్చించారు. శ్రీకృష్ణ విజయం సినిమా తీసిన సమయంలో సీనియర్ ఎన్టీఆర్ తాను వేసిన కృష్ణుడి వేషంలో పౌండ్రక వాసుదేవుడిగా నాగభూషణం గెటప్ చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, ఆ పాత్ర అలాగే ఉంటుందని చెప్పినా వినలేదని రాశారు. చివరికి తాను నటిస్తే నటించండి లేకపోతే మానుకోండి అని కఠినంగా చెప్పిన తర్వాత నోరు మెదపకుండా నటించారని చెప్పుకున్నారు.
అంతేకాదు చంద్రబాబునాయుడితో తన కూతురు భువనేశ్వరి పెళ్లి చేస్తున్నప్పుడు తనను గదులు బుక్ చేయాలని ఎన్టీఆర్ అడిగారని, వాటిని బుక్ చేసి బిల్లులు పంపితే ఆ డబ్బులు తనకు ఇవ్వలేదనీ, ఇటువంటి చేదు అనుభవాలతో విసిగి వేసారి చివరికి ఎన్టీఆర్‌తో సినిమాలే తీయకూడదని నిర్ణయించుకున్నానని రాసుకున్నారు.
ఇంకా చిరంజీవి, శోభన్ బాబు, జమున, జయలలిత, రాజశేఖర్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీలో చాలామందిని ఉతికి ఆరేశారు మల్లెమాల. నటీనటులనే కాదు దర్శకులను కూడా వదిలిపెట్టలేదు. దీంతో ఇపుడా పుస్తకం పేరు చెబితేనే ఇండస్ట్రీలో కొంతమంది ముఖం రంగులు మారిపోతున్నాయి. మొత్తమ్మీద మల్లెమాల ఇదీ నా కథ పుస్తకం మార్కెట్లో ఎక్కడా లేకుండా చేయాలని పలు అగ్రశ్రేణి నటులు, నిర్మాతలు, దర్శకులు సైతం చెప్పడం గమనార్హం.