1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Tollywood

Pundarikakshaiah | Tollywood | నిర్మాత, నటుడు పుండరీకాక్ష్యయ్య ఇక లేరు

పుండరీకాక్ష్యయ్య
అట్లూరి పుండరీకాక్ష్యయ్య(87) చెన్నైలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అస్వస్తులుగా వున్న ఆయన గురువారం ఉదయం పరమపదించారు. కృష్ణాజిల్లా చౌటపల్లి గ్రామంలో 1925 ఆగష్టు 19న జిన్మించారు. ఆయన పలు నాటకాలను వేసారు. 'భక్తప్రహ్లాద' చిత్రంలో తొలిసారిగా నటించారు.

తన సోదరుడు త్రివిక్రమరావుతో నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్‌ అనే సంస్థను స్థాపించి పలు చిత్రాలను నిర్మించారు. వారు నిర్మించిన చిత్రాలలో 'జయసింహ', 'మహామంత్రి తిమ్మరసు', 'శ్రీకృష్ణావతారం', 'భలేతమ్ముడు', 'మనుషుల్లో దేవుడు', 'ఆరాధన', 'మేలుకొలుపు' లాంటి విజయవంతమైన చిత్రాలున్నాయి. దివంగత నందమూరి తారకరామారావుతో ఆయనకు మంచి అనుబంధం వుండడంతో ఆయనతో అధికంగా చిత్రాలను నిర్మించారు. వీరు నిర్మించిన 'మహామంత్రి తిమ్మరుసు' చిత్రం జాతీయఅవార్డును పొందింది.

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావును మాటల రచయితగా పరిచయం చేయడంతో పాటు 'ఆరాధన' చిత్రం ద్వారా మహమ్మద్‌ రఫీని కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత పుండరీకాక్ష్యయ్యదే. ఆయన చివరి చిత్రం 'రాఘవయ్యగారి అబ్బాయి'. ఈయన 20 తెలుగు, 6 కన్నడ చిత్రాలలో నటించారు. విజయశాంతి ప్రధానపాత్రలో రూపొందిన 'కర్తవ్యం' చిత్రంలో ఆయన పోషించిన 'ముద్దుకృష్ణయ్య' పాత్ర ద్వారా అందరి ప్రశంసలు పొంది సరికొత్త రీతిలో ప్రతినాయకుడిని చూపించారు.

చెన్నై వలసరవాక్కంలోని ఆయన ఇంటిలో వుంచిన భౌతికకాయానికి నిర్మాతలు కాట్రగడ్డ ప్రసాద్‌, మురారి, నటుడు కళ్యాణచక్రవర్తి తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. చెన్నై పోరూర్‌లోని శ్మశాన వాటికలో శుక్రవారం ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT