1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ప్రకటనల్లో..... అసిన్‌ విజయ రహస్యం

అసిన్‌ మలయాళ భామ అసిన్‌ లక్స్‌ సబ్బు బిళ్ల బాలివుడ్‌ ఫెయిర్‌ ఎవర్‌
తెలుగులో పరిచయమైన మలయాళ భామ అసిన్‌ ప్రస్తుతం తమిళ సినీ రంగంలో యమా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇతర ఏ భాషల్లోనూ నటించేందుకు సైతం కాదనే రీతిలో అక్కడ ఆమె దాదాపు నెంబర్‌ వన్‌ స్థానాన్ని ఆక్రమించేసింది. ఆమె దూకుడుకు దక్షిణాది సినీ రంగంలో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నట్టు చెబుతున్న త్రిష సైతం బెంబేల్తెతి పోతోందంటే ఆశ్చర్య పోనక్కర లేదు.

ఆమె ఇలా విజయ పథాన నడవడానికి కారణాలు కూడా లేకపోలేదు. తన కంటూ ఓ విధానాన్ని ఏర్పరచుకుని, అందుకు అనుగుణంగా నడవడమే ఆమె విధానం. ఇటీవల లక్స్‌ సంస్థ తమ సబ్బు బిళ్ల ప్రకటనలో నటించాలని ఆమెను కోరగా, ఆమె దాన్ని నిర్ద్వందంగా తిరస్కరించింది. బాలివుడ్‌ తారామణులకే ఈ ప్రకటనల్లో నటింపజేసే లక్స్‌ సంస్థ తొలి సారిగా దక్షిణాది నటివైపు మొగ్గు చూపడం గమనార్హం. పెద్ద మొత్తంలో చెల్లిస్తామని వారు చెప్పినప్పటికీ, అసిన్‌ ససేమిరా అంది.

బంగారం లాంటి అవకాశాన్ని ఆమె పోగొట్టుకుందని అందరూ చెబుతుంటే.. తను మాత్రం అదేమీ కాదంటోంది. తాను ఇప్పటికే ఫెయిర్‌ ఎవర్‌ సంస్థ ప్రకటనలో నటించినందున.. అదే తరహాలో శరీరాన్ని కాంతినిస్తుందని చెప్పే లక్స్‌ ప్రకటనలో నటించడం సరైన పద్ధతి కాదని భావించినందునే వారి ఆఫర్‌ను తిరస్కరించానంది. చివరకు ఫెయిర్‌ ఎవర్‌ సంస్థ సైతం లక్స్‌ ప్రకటనలో నటించేందుకు తమకు అభ్యంతరం లేదని చెప్పినప్పటికీ, ఆమె అంగీకరించలేదంటే ఆమె నిజాయతీని అర్థం చేసుకోవచ్చు. ఒకే రకమైన కాస్మొటిక్‌ కంపెనీల తరపున నటించలేనని తేల్చిచెప్పింది. బహుశా ఆమె విజయ రహస్యం.. ఇదే కావచ్చునేమో.
About Writer
WD