తెలుగు, తమిళ చిత్రసీమల్లో విలక్షణ నటుడిగా పేరుగాంచిన ప్రకాష్ రాజ్ తన భార్య నుంచి విడాకులు కోరాడు. ఆయన సినీనటి లలితకుమారిని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. అయితే.. వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధల కారణంగా.. విడాకుల కోసం ఆయన ఈనెల 20వ తేదీన చెన్నైలోని ఎగ్మూర్ కుటుంబ కోర్టును ఆశ్రయించినట్టు కోడంబాక్కం వర్గాల సమాచారం. ఈ సందర్భంగా ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ పరస్పర అవగాహనతో తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
తన పిల్లలకు తనే సంరక్షకుడిగా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. తన వ్యక్తిగత కార్యదర్శి, కొరియోగ్రాఫర్ అయిన బోనీ వర్మతో పాటు.. మరో సినీ నటితో ఉన్న సన్నిహిత సంబంధం కారణంగానే భార్య నుంచి విడాకులు కోరుతున్నట్టు తనపై వచ్చిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.
"నాకు ఎలాంటి వివాహేతర సంబంధాలు లేవు. అవన్నీ వట్టి పుకార్లే" అని ప్రకాష్‌రాజ్ స్పష్టం చేశాడు. కాగా ప్రకాష్‌రాజ్, లలితకుమారి మధ్య సయోధ్య కోసం తెలుగు సినీ హీరో శ్రీహరి, ఆయన భార్య డిస్కోశాంతి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ భార్య లలితకుమారి, శ్రీహరి భార్య డిస్కోశాంతి స్వయానా అక్కాచెల్లెళ్లు కావడం వల్ల వారిద్దరి కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టేందుకు చెల్లెలు కృషి చేస్తోంది.
|