తెలుగు, తమిళ, మలయాళం ఇలా అన్ని భాషల్లో తన సత్తా నిరూపించుకున్న హీరోయిన్ అసిన్. అయితే ఈ మధ్య అసిన్ ఉన్న సినిమా ఒక్కటీ కన్పించడం లేదు. అంతేనా ఆమె నటిస్తోన్న తాజా సినిమాలు సైతం ఒక్కటీ లేవు. దీంతో అసిన్ కనిపించడం లేదని ఆమె అభిమానులు ఫీలవుతున్నారట. అదేంటి అసిన్ బాలీవుడ్ గజనీలో నటిస్తోంది కదా. మరి సినిమాలు లేవంటారేంటి అని ఆశ్చర్యపోకండి.
తెలుగులో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆపై పలు చిత్రాల్లో నటించింది. అయితే తెలుగు తెరపై ఇలియానా ప్రభంజనం మొదలయ్యే సరికి తమిళ చిత్రాలవైపు మొగ్గు చూపిన ఈ బామ అక్కడ కూడా బాగానే పాపులర్ అయ్యింది. తమిళంలో అసిన్ హీరోయిన్‌గా చేసిన గజని చిత్రం ఎంతపెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం ఆ చిత్రంలో పోషించిన పాత్రనే హిందీలో అమీర్‌ఖాన్ సరసన చేస్తోన్న గజని చిత్రంలోను పోషిస్తోంది. అలాగే కమల్‌హసన్ పది పాత్రలతో అత్యంత భారీగా రూపొందుతోన్న దశావతారం చిత్రంలోను అసిన్ నటిస్తోంది. ఈరెండు చిత్రాల్లో నటించడం వల్లనే అసిన్ ప్రస్తుతం ఏ చిత్రంలోనూ కన్పించడం లేదని కొందరు చెప్పుకుంటున్నారు.
ఇంతకీ సంగతేంటని విచారిస్తే హిందీ గజని, దశావతారం రెండూ కూడా మెగా ప్రాజెక్టులే. ఈ చిత్రాలు రెండూ విడుదలైతే అటు బాలీవుడ్‌లోను, ఇటు తమిళ, తెలుగులోనూ అసిన్ పేరు మారుమ్రోగిపోవడం ఖాయం. అప్పుడు ఇంతకన్నా పెద్ద చిత్రాల్లో నటించే ఛాన్స్ అసిన్ వశమౌతుంది.
అలాంటప్పడు ప్రస్తుతం చిన్నా చితకా చిత్రాలను ఒప్పేసుకుంటే భవిష్యత్‌లో పెద్ద చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినా కుదరకపోవచ్చు. అందుకే రానున్న మంచికాలం కోసం అసిన్ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని ఆమె సన్నిహితులు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ వింటుంటే అమ్మో అసిన్‌కు ఎన్ని తెలివితేటలో అనిపించక మానదు.
అయితే గతంలో రజనీకాంత్ సరసన శ్రియ నటించినపుడు కూడా ఇలాగే చెప్పుకున్నారు. ప్రస్తుతం శ్రియ ఎక్కడుందో అని ఆమె అభిమానులు వెతుక్కుంటున్నారు. అసిన్ కూడా అదే బాటలో నడిస్తే అభిమానులు తలచుకోవడం కూడా మానేసే ప్రమాదముందని మరికొందరు అనుకుంటున్నారు.
|