తెలుగులో జెనీలియా నటించిన 'బొమ్మరిల్లు' చిత్రం మెగాహిట్ సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రం తమిళ రీమేక్‌లోను జెనీలియానే హీరోయిన్‌గా తీసుకున్నారు. 'సంతోష్ సుబ్రమణ్యం' పేరుతో తమిళంలో రూపొందిన ఈ చిత్రం సైతం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
దీంతో జెనీలియా చాలా హ్యాపీగా ఫీలవుతోందట. అంతేనా వరస విజయాలు తనను వరిస్తుండడంతో తాను చాలా అదృష్టవంతురాలని జెనీలియా పొంగిపోతోందట. అలా ఖుషీగా ఉన్న జెనీలియాతో మీ తమిళ చిత్రం హిట్ అయినందుకు మీరు ఎలా ఫీలవుతున్నారంటే చాలా సంతోషంగా ఉన్నట్టు చెప్పిందట.
బొమ్మరిల్లులో పోషించిన పాత్రనే తమిళంలోనూ పోషించడం, అక్కడసైతం మంచి హిట్ సాధించడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని జెనీలియా చెప్పిందట. అయితే ఇంత మంచి ప్రేమకథా చిత్రంలో నటించారు కదా మరి ప్రేమపై మీ అభిప్రాయం ఏమంటే ప్రేమే జీవితం అని అద్భుతంగా సమాధానమిచ్చిందట.
మనం మన తల్లితండ్రులను, కుటుంబాన్ని ప్రేమిస్తాం కదా అంటూ చెప్పిన జెనీలియా అయితే తను మాత్రం ప్రస్తుతానికి ప్రేమలో పడలేదని సమాధానమిచ్చిందట. అంతేనా ప్రేమ అనే ఘట్టం తన జీవితంలో ఇంకా రాలేదని సెలవిచ్చిందట. ప్రస్తుతానికి తాను ఒంటరిగానే చక్కగా ఎంజాయ్ చేస్తున్నానని కూడా చెప్పిందట.
తాను జీవితంలో చాలా ఆశావాద ధృక్పథంతో ఉంటానని, అందుకే అపజయాలు ఎదురైనపుడు తనేంటో నిరూపించుకోవడానికి ప్రయత్నించానని ముగించిందట.
|