1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

అన్నకోసం తమ్ముడు టైటిల్ త్యాగం...?

అన్నకోసం తమ్ముడు టైటిల్
నాగబాబు హీరోగా, కోడిరామకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి 'ఏక్ పోలీస్' అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో నాగబాబు పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తొలుత 'అధినాయుకుడు' అనే టైటిల్ పెట్టనున్నట్టు ప్రచారం జరిగింది.

అంతకుముందు ఈ టైటిల్‌ను చిరంజీవి నటించనున్న 149 వ చిత్రానికి పెట్టనున్నట్టు చెప్పారు. కానీ చిరంజీవి రాజకీయాల్లోకి రావడం ఖాయమని తేలడంతో ఆయన ఇకపై చిత్రాల్లో నటించడం అనుమానమేనని కొందరు చెప్పడం ప్రారంభించారు. చిరంజీవి సినిమా ఇప్పట్లో లేనందువల్లే అధినాయకుడు టైటిల్‌ను ఆయన సోదరుడు నాగబాబు వాడుకోనున్నారనే వార్తలు సైతం వినిపించాయి.

కానీ విచిత్రంగా ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అధినాయకుడు అనే టైటిల్‌ను చిరంజీవి త్వరలో నటించబోయే చిత్రానికే పెట్టాలని నిర్ణయించారట. అందుకే నాగబాబు అధినాయకుడు టైటిల్‌ను పక్కన పెట్టి తన చిత్రానికి ఏక్ పోలీస్ టైటిల్‌ను ఖరారు చేసుకున్నారని టాలీవుడ్ వర్గాల కథనం.

అధినాయకుడు టైటిల్‌తోనే చిరంజీవి 149వ చిత్రం ఉంటుందని ఆ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని మళ్లీ టాలీవుడ్‌లో ఓ కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనే సంగతి మరికొద్దిరోజులు ఆగితే తప్ప తెలిసేలా లేదు.
About Writer
Munibabu