యువహీరో పవన్ కళ్యాణ్ సరసన "బంగారం" సినిమాలో నటించిన అందాల భామ "మీరాచోప్రా" సినీ పరిశ్రమకు గుడ్‌బై చెప్పబోతుందట. ఏం కారణమో తెలుసా..? అమ్మడు ప్రేమలో పడిందట. త్వరలో సినిమా రంగానికి స్వస్తి చెప్పి, తనకిష్టమైన జర్నలిజం ఫీల్డులో స్థిరపడనున్నట్లు సినీ వర్గాలు కోడైకూస్తున్నాయి.
ఢిల్లీకి చెందిన యువకుడిని మీరాచోప్రా ప్రేమిస్తున్నట్లు, వీరిద్దరూ చెన్నైలో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నట్లు వస్తున్న వార్తలపై మీరాచోప్రా స్పందిస్తూ... తను ప్రేమలో పడిన విషయం నిజమేనని, త్వరలో సినిమాకు గుడ్‌బై చెప్పి కొత్త జీవితంలో అడుగు పెట్టనున్నట్లు మీరా వెల్లడించింది.
ఇదిలా ఉండగా, నితిన్, మీరా చోప్రా హీరోహీరోయిన్లుగా సిద్దిఖ్ రూపొందించిన 'సత్యం శివం సుందరం' ఇంకా విడుదల కాలేదు. ఈ సినిమాకు అనంతరం ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో విడుదలైన "వాన"లో నటించినప్పటికీ చోప్రాకు పెద్దగా గుర్తింపు రాని విషయం తెలిసిందే.
అయితే తమిళ సినిమాల్లో మీరా చోప్రా బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా తమిళ మాతృక ఆధారంగా తెలుగులోకి అనువదింపబడిన అర్జున్ "సింగమలై" సినిమాలో మీరాచోప్రా నటించింది. ప్రస్తుతం ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న "జగన్మోహిని" సినిమాలో నటిస్తోంది.