"పారితోషికం" ఎక్కువడిగితే తప్పేంటని అందాల ముద్దుగుమ్మ ప్రియామణి అంటోంది. ప్రముఖ తమిళ దర్శకుడు అమీర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుని తెరకెక్కిన "పరుత్తివీరన్" సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డు లభించగా, ఆ సినిమా హీరో కార్తీక్‌కు ఉత్తమ నటుడు, హీరోయిన్ ప్రియామణికి ఉత్తమనటీమణి అవార్డులు లభించిన సంగతి తెలిసిందే.
"పరుత్తివీరన్"కు తర్వాత ప్రియామణికి అవకాశాలు వెల్లువల్లా రావడంతో పారితోషికాన్ని లక్షల సంఖ్యలో పెంచేసిందని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ విషయమై ఆమె స్పందిస్తూ.. పారితోషికం ఎక్కువడిగితే తప్పేంటని ప్రశ్నించింది. పరుత్తివీరన్‌లో తన నటనాశైలికి అవార్డు దక్కిన సంగతిని గుర్తు చేసిన అమ్మడు, గ్రామీణ అమ్మాయిగానే కాకుండా "మలైకోట్టై" లోనూ గ్లామరస్ రోల్‌ను పోషించానని చెప్పింది.
తన కెరీర్ డెవలప్‌మెంట్‌కు పారితోషికాన్ని పెంచడంలో మంచిదేనని నిక్కచ్చిగా చెబుతోంది. ప్రస్తుతమున్న పారితోషికానికంటే ఏ మాత్రం తక్కువ కాకుండా, దానికంటే ఎక్కువగా డిమాండ్ చేయడం తప్పేమీ లేదని ప్రియామణి వెల్లడించింది.
మొత్తానికి ఎంత పారితోషికం డిమాండ్ చేస్తున్నారనే విషయాన్ని కప్పిపుచ్చిన ప్రియామణి... 40లక్షల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయనడంతో అమ్మడు ఒక్కసారిగా నవ్వేసింది. ఈ నవ్వుకు అర్థమేమిటో మనకేం తెలుసు.. మరీ...!