"ప్రియదర్శన్" దర్శకత్వంలో సమీరా రెడ్డి!
|
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ప్రియదర్శన్ కామెడీ చిత్రం "డి డానా డాన్"లో సమీరా రెడ్డి నటిస్తోంది. తాజాగా "బామ్ బామ్ భోలే" చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రియదర్శన్... త్వరలో "డి డానా డాన్"ను కూడా చిత్రీకరించనున్నారు. ఈ సినిమా సాంకేతిక పరంగా "హేరా పేరీ"కి పోలికలున్నట్లు వస్తున్న వార్తలు సరికాదని, "డి డానా డాన్" ఆ చిత్రాన్ని పోలి ఉండదని చిత్ర యూనిట్ వెల్లడిస్తోంది.
ఇకపోతే... ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, కత్రీనా కైఫ్, సునీల్ శెట్టి, నేహా ధూపియాలు నటిస్తున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో నటించడం పట్ల సమీరా రెడ్డి స్పందిస్తూ... ప్రియాన్ డైరక్షన్ అంటే చాలా ఇష్టమని, ఇంతకుముందే ఆయన రూపొందించిన చిత్రంలో నటించానని చెప్పింది.
"డి డానా డాన్" చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబరులో ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రియాన్ "బామ్ బామ్ భోలే" సినిమాతో బిజీగా ఉండటంతో వచ్చే ఏడాది 2009 జనవరి నాటికి ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు సమీరా వెల్లడించింది.
ఇదిలా ఉండగా, "డి డానా డాన్"లో నటించేందుకు అసిన్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వెలువెత్తాయి. అయితే... స్క్రిఫ్ట్ ప్రకారం కత్రీనాను సెలెక్ట్ చేయడం జరిగిందని, అంతేకాకుండా అమీర్ ఖాన్ "గజిని" సినిమాలో అసిన్ బిజీగా ఉండటంతో ఈ ఛాన్స్ మిస్సయిందని బాలీవుడ్ వర్గాల సమాచారం.
