మూడు దశాబ్దాలుగా వెండితెరపై నటుడిగా వెలుగొందిన మెగాస్టార్ చిరంజీవి "ప్రజారాజ్యం" పార్టీ స్థాపించి రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడా "ప్రజారాజ్యం" టైటిల్‌తో సినిమా తెరపైకి రానుంది. ఓ సక్సెస్‌పుల్ డబ్బింగ్ ప్రేమకథా చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన చిరంజీవి అభిమాని ఈ టైటిల్‌ను రిజిష్టర్ చేశారు.
గతంలో వచ్చిన "ప్రజారాజ్యం" సినిమాలో కృష్ణ హీరోగా నటించారు. ఏదైనా ఒక టిటైల్‌తో సినిమా వచ్చి పది సంవత్సరాలు దాటితే... అదే పేరుతో మరో సినిమా నిర్మించే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం తాజా "ప్రజారాజ్యం" సినిమాలో రాజకీయ అంశాలు పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది.
సినిమా పేరు "ప్రజారాజ్యం" కాబట్టి చిరంజీవి ఇందులో నటిస్తారా? అన్న అనుమానం రాక తప్పదు. నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చిరంజీవి నటించే అవకాశం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండదు. ఎన్నికలకు ముందే సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తారా? హీరోగా ఎవరు నటిస్తారు.? అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.